
టీవీలో వచ్చే రియాలిటీ షోను అనుకరించబోయి ఓ చిన్నారి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మంథని పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తున్న దాసరి కాశీ విశ్వనాథ్ సాహస కార్యక్రమాన్ని అనుకరించబోయి ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకున్నాడు.
వివరాల్లోకి వెలితే.. దాసరి కాశీ విశ్వనాథ్ అనే బాలుడు తల్లితండ్రులను కోల్పోయి అమ్మమ్మ దాసరి భూదేవి, తాత లచ్చయ్యలు వద్ద ఉంటున్నాడు. పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు హాలిడే ఉండటంతో ఇంట్లోనే ఉండి ఎవరూ లేని సమయంలో టీవీలో వస్తున్న ఓ సాహస రియాల్టీ షోను చూస్తున్నాడు. దానిని అనుకరించాలని భావించి నోటిలో కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్లతో మంటను ఊదడానికి ప్రయత్నించి ప్రమాదానికి లోనయ్యాడు.
ఈ ప్రమాదంలో కాశీ విశ్వనాథ్ శరీరం దాదాపుగా 70శాతం వరకు కాలిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన మంథని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ్నుంచి మెరగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కానీ ప్రమాదానికి గురైన తీరుపై కుటుంబ సభ్యులు పెదవి విప్పకపోవడం పలు అనుమానాలకు రేకిత్తిస్తుంది.