
రేపు అమరావతికి వెళ్లనున్నారు టిడిపి రెబెల్ నేత రేవంత్ రెడ్డి. పార్టీలో గత పది రోజులుగా సునామీ సృష్టించిన రేవంత్ రెడ్డి తాజాగా చంద్రబాబుతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఏకంతంగా కలిసి మాట్లాడారు. కొద్దిసేపు మాత్రమే ఈ భేటీ జరిగింది. అయితే ఈ సందర్భంగా పలు అంశాలపై బాబుకు రేవంత్ వివరణ ఇచ్చారు. పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు. అయితే రేపు అమరావతి రావాలని పూర్తి వివరాలు అక్కడ మాట్లాడదామంటూ రేవంత్ కు బాబు సూచించారు. దీంతో రేవంత్ సరే అంటూ వచ్చేశారు. అయితే రేపు ఉదయం 10 గంటలకు బాబుతో రేవంత్ అమరావతిలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే రేవంత్ భవిష్యత్తు తేలిపోతుందని పార్టీలో చర్చ జరుగుతున్నది.
రేవంత్ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసిన మోత్కుపల్లి
తెలంగాణ టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం లేక్ వ్యూ గెస్టు హౌస్ లో జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ విషయాన్ని, రేవంత్ విషయంలో వస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలను చర్చకు తెచ్చే ప్రతయ్నం చేశారు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్. అయితే చంద్రబాబు మాత్రం ఆ విషయం అవసరం లేదని వారించారు. ఇప్పటికే పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని, ఇంకా ఈ విషయాన్ని పెద్దది చేయడం సరికాదన్నట్లు బాబు వారించారని తెలిసింది. మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ రేవంత్ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసినప్పుడు కూడా రేవంత్ నోరు విప్పలేదు అని విశ్వసనీయ సమాచారం.
రేపు అమరావతిలో రేవంత్ విషయంలో జరుగుతున్న పరిణామాలు, విమర్శలు, ప్రతి విమర్శలపై సుదీర్ఘమైన సమావేశం జరిగే అవకాశం ఉంది. రేవంత్ తో పాటు టిడిపి తెలంగాణ ముఖ్య నేతలను కూడా బాబు అమరావతికి ఆహ్వానించినట్లు తెలిసింది.
ఏది ఏమైనా రేపు రేవంత్ భవితవ్యం, తెలంగాణలో టిడిపి భవితవ్యం రెండూ తేలిపోతాయని టిడిపికి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి