Latest Videos

మహా శివరాత్రి కోసం 2,427 ప్రత్యేక బస్సులు.. భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు

By Mahesh KFirst Published Feb 17, 2023, 5:44 PM IST
Highlights

మహా శివరాత్రిని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసి 40 ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను అందించారు. ఇందుకోసం 2,427 బస్సులను నడుపుతున్నారు. 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది.
 

మహా శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల రాకపోకలకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవ దేవాలయాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచనుంది. ఇందుకోసం 2,427 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 18న మహాశివరాత్రి పండుగ ఉన్న సంగతి తెలిసిందే.

ప్రత్యేక సర్వీసుల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి 578 బస్సులు, వేములవాడకు 481 బస్సులు, కీసరగుట్టకు 239 బస్సులు, ఏడుపాయలకు 497 బస్సులు, వేలాలకు 108 బస్సులు, కాళేశ్వరానికి 51 బస్సులు, కొమురవెల్లికి 52 బస్సులు, కొండగట్టుకు 37 బస్సులు, అలంపూర్‌కు 16 బస్సులు, రామప్పకు 15 బస్సులు, ఉమా మహేశ్వరానికి 14 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నది. ఈ పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, రద్దీకి అనుగుణంగా ఇంకొన్ని సర్వీసులను నడపడానికి టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

Also Read: సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. టికెట్స్‌పై డిస్కౌంట్.. వివరాలు ఇవే..

ముఖ్యంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్‌ల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్టు వివరించింది.

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలుగకుండా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం  అన్ని చర్యలు తీసుకుంటున్నదని, రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ, ఐపీఎస్ వీసీ సజ్జనార్ తెలిపారు. భక్తులు ఈ సర్వీసులను ఉపయోగించి క్షేమంగా పుణ్యక్షేత్రాలు సందర్శించి తమ మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు. అలాగే అద్దె బస్సులపై 10 శాతం రాయితీని కల్పిస్తున్నామని, అద్దె బస్సు సౌకర్యాన్నీ భక్తులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.

click me!