
పోలీస్ జాబ్స్ కోసం గర్బిణీలు, బాలింతలకు తెలంగాణ పోలీస్ శాఖ మరో అవకాశం కల్పించింది. దేహదారుఢ్య ఎంపిక పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు మరో అవకాశం ఇచ్చింది టీఎస్ఎల్‌పీఆర్‌బీ. ప్రాథమిక పరీక్షల్లో అర్హత పొందిన వారు మెయిన్స్‌లో అర్హత పొందాక దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనవచ్చని ప్రకటించింది.
ఇకపోతే.. ఇటీవల ఒక్క సెంటిమీటర్ ఎత్తుతో ఫిజికల్ టెస్టులకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని, అలాంటి అభ్యర్థులకు తిరిగి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా.. తెలంగాణ ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే.. ప్రిలిమినరీ, ఫిజికల్ ఈవెంట్స్ పూర్తయ్యాయి. ఇక మెయిన్స్ పరీక్షలు మాత్రమే మిగిలాయి. ఈ క్రమంలో ఎత్తు విషయంలో డిస్ క్వాలిఫై అయి.. ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో.. ఈవెంట్స్ కు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని కోర్టు ఆదేశించింది.
ALso Read: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. వారికి మళ్లీ ఈవెంట్స్.. బోర్డ్ కీలక నిర్ణయం
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)తాజాగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఒక సెంటిమీటర్ లేదా అంత కంటే తక్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు అభ్యర్థులు మరోసారి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. వీరికి అంబర్‌పేట పోలీసు గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్‌లో ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకూ.. 16,969 కానిస్టేబుల్ పోస్టుల తుది రాతపరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. అంటే ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీలో ఉన్నారు. అలాగే 587 ఎస్‌ఐ పోస్టుల కోసం 59,574 మంది అర్హత సాధించారు. అయితే.. తాజా నిర్ణయంతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.