ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో సీపీఎంతో కలిసి పోటీ చేస్తామని సీపీఐ ప్రకటించింది. ఈ విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నట్టుగా సీపీఐ నేతలు ప్రకటించారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీచేస్తాయని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనం నేని సాంబశివరావు చెప్పారు. శుక్రవారం నాడు హైద్రాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో తేల్చే సత్తా సీపీఐ, సీపీఎంకి ఉందని కూనంనేని సాంబశివరావు తెలిపారు. 2018 ఎన్నికల్లో సాలెగూడులో ఇరుక్కున్నామన్నారు. త్వరలోనే సీపీఐ, సీపీఎంలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టుగా కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఎవరికి ఎవరు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన పరోక్షంగా బీఆర్ఎస్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల గురించి బీఆర్ఎస్ తో చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. అవసరం ఉంటే బీఆర్ఎస్ మా వద్దకే వస్తుందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్‌కి మద్దతిచ్చినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమన్నారు. విద్యుత్ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని కూనంనేని సాంబశివరావు తెలిపారు. పంటలు ఎండిపోకుండా విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
గత ఏడాదిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కి సీపీఐ, సీపీఎలు మద్దతుప్రకటించాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తాయనే సంకేతాలు ఇచ్చాయి. అయితే ఇవాళ సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేరిన సమయంలో సీపీఐ నేతలు ఈ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల సమయంలో సీపీఐ, సీపీఎంలను కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు కోరింది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.