
గన్ పార్కులోని అమరుల స్థూపం తెలంగాణ ఉద్యమ చరిత్రకి సజీవ సాక్ష్యం.
1969 నుంచి 2014 వరకు జరిగిన ప్రత్యేక ఉద్యమ పోరాటానికి నాంది ఘట్టం.
ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులుబాసిన వందలమందిని స్మరించే పవిత్ర కట్టడం అది.
అందుకే ఏ నిరస గళమైన, ఏ విజయ నినాదమైన తెలంగాణ వాదులు అక్కడి నుంచే ప్రారంభిస్తారు.
ప్రతి ఉద్యమాన్ని, విజయోత్సవాన్ని తన దగ్గర నుంచే ప్రారంభిస్తారని గర్వంగా భావించే ఆ స్థూపం ఇప్పుడు పాలకుల నిర్లక్షానికి కన్నీరు కారుస్తోంది.
తూటాలకు బలైన , లాఠీలకు రక్తమోడిన తన ఉద్యమ బిడ్డలను చూసి కూడా చలించని ఆ స్థూపం.. ఇప్పుడు స్వపాలకుల నిర్లక్ష్యంపై కన్నెర్ర జేస్తోంది.
అమరుల స్థూపం ఆవేదనకు ఇదీ కారణం...
1969 లో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం తీవ్రస్థాయిలో ఎగిసిపడింది. వందలమంది ఆ ఉద్యమంలో పోలీసుల తూటాలకు, లాఠీ చార్జీలకు బలైపోయారు.
వారందరినీ స్మరించే ఉద్దేశంతో అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక స్థూపాన్ని నిర్మించాలని నిర్ణయించింది. దానికి అసెంబ్లీ ముందు ప్రాంతాన్ని ఎన్నుకుంది.
ప్రభుత్వం అనుమతించకపోయినా, పోలీసుల పహారా ఉన్నా... ఎట్టకేలకు అప్పటి నగర మేయర్ లక్ష్మీనారాయణ తదితరులు 1971 లో ఇక్కడ స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
369 మంది అమరులను స్మరిస్తూ వారి బలిదానాలకు సాక్షిగా నిలిచేలా ఎక్కా యాదగిరి రావు గన్ పార్కులోని అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. దాదాపు నాలుగేళ్లు దీన్ని నిర్మాణం సాగింది.
అయితే ఇంకా ఆ అమరుల స్థూపం ప్రారంభానికే నోచుకోలేదు. నాటి ఉద్యమకారుల సాక్షిగా ఇది నమ్మలేని నిజం.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మన చరిత్ర, మన సంస్కృతి అంటూ వెయ్యేళ్ల వెనకటి ఘన చరిత్రను కూడా వెలికితీసిన చరిత్రకారులు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉద్యమపార్టీలు ఈ విషయాన్ని ఎందుకు మరిచారో ఇప్పటికీ తెలియడం లేదు.
తెలంగాణ సంస్కృతని ప్రతిబింబించే బతకుమ్మ, బోనాలకు వందల కోట్లు ఖర్చు చేసినప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచే అమరుల స్థూపానికి కనీసం అధికారిక ప్రారంభోత్సవం కూడా చేయకపోడంపై నాటి ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రా సినిమాల ఆడియో ఫంక్షన్ లకు వెళ్లడానికి టైం ఉండే పాలకులకు అమరుల స్థూపానికి రిబ్బన్ కట్ చేయడానికి కూడా సమయం లేదా అన్ని ప్రశ్నిస్తున్నారు.
అమరుల స్థూపం పై అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దంటు నాగార్జున శర్మ స్పందిస్తూ ... కేసీఆర్ తన పోరాటాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఇక్కడి నుంచే ర్యాలీగా వెళ్లారు. సీఎం అయ్యాక స్థూపాన్నిపూర్తిగా మరిచిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తామంటున్న హైదరాబాద్ నగరపాలక సంస్థ కూడా అమరుల స్థూపాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు.
స్థూప నిర్మాణం చేపట్టినందుకు ఎక్కా యాదగిరి రావుకు 40 ఏళ్ల కిందటే రూ. 69,740 లు చెల్లించాలి. కానీ, ఇప్పటి వరకు పైసా కూడా ఆయన చేతికి అందలేదన్నారు.