
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలనే నినాదంతో సోషల్ మీడియా చలో విశాఖకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై తెలంగాణ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత స్పందించారు.
ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కవిత స్పష్టం చేశారు.
తమ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుందని ప్రకటించారు. ఈ విషయంపై గతంలోనే తమ పార్టీ అంగీకారం తెలిపిందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటించారు. అలాగే, రాజ్యసభలో ఆంధ్రకు ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో కూడా టీఆర్ఎస్ పాల్గొంది. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో తమ నుంచి ఏలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు.
ఒక వేళ సాంకేతికంగా ఏపీకి ప్రత్యేకం హోదా ఇవ్వడం సాధ్యం కాకపోతే రాజకీయంగానైనా కేంద్రప్రభుత్వం దీనిపై పరిష్కారం చూపాల్సి ఉంటుందన్నారు.
అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఈ సమస్యకు ముగింపునివాలన్నారు. ఏపీ కి ప్రత్యేక హోదాపై పార్టీలతో చర్చలు జరిపితే తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని ప్రకటించారు.