ఈ కోటి మొక్కల రామయ్యకు ‘పద్మశ్రీ’

First Published Jan 25, 2017, 10:37 AM IST
Highlights

నాటి రాముడు అడవులకు పోతే... తెలంగాణకు చెందిన ఈ రాముడు అడవినే తన వద్దకు తెచ్చుకున్నాడు. కోటి మొక్కలునాటి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందాడు.


భద్రాద్రి రాముడి చెంత పచ్చదనం తోరణాన్ని కట్టిన వనజీవి రామయ్యకు అరుదైన గౌవరం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

 

ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపెల్లి రామయ్య. కానీ, ఈ పేరుతో కంటే వనజీవి రామయ్యగానే ఆయన సుపరిచితులు. మొక్కలు నాటడమే తన జీవిత ధ్యేయంగా పచ్చదనంతో భూమిని నింపాలని కంకణం కట్టుకున్నాడాయన. ఇప్పటికే కోటి మొక్కులు నాటి రికార్డు సృష్టించారు.

 

పెద్దగా ఎవరికీ తెలియని చెట్ల పేర్లు, ఎవరూ చూడని విత్తనాలు సేకరించి బస్తాల్లో నింపి నిల్వ చేసే రామయ్య వర్షాకాలం ఆరంభంకాగానే  మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెడుతారు.

 

ఎవరి ఆర్థికసాయం లేకుండా రోడ్లకు ఇరువైపులా, చెరవు కట్టల వెంట, జాతరలు, ఖాళీ జాగాల్లో, ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా అక్కడ మొక్కలు నాటేందుకు కృషి చేస్తుంటాడు.
 

తాను పచ్చదనం కోసం పరితపించడమే కాదు... ఇతరులు కూడా ఆ పనిచేసాలా ప్రచారం కూడా నిర్వహిస్తుంటాడు. వృక్షోరక్షతి.. రక్షితః అని బోర్డును తలకు, సైకిల్‌కు తగిలించుకుని ఖమ్మం చుట్టు పక్కల మొక్కల పెంపకంపై ప్రచారం చేస్తూ ఉంటాడు.

 

కోటి మొక్కలు నాటిన నిరుపేద వనజీవి రామయ్య కృషిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం తెలంగాణకే గర్వకారణం.

 

కాగా, రామయ్యకు  గతంలో కూడా పలు అవార్డులు వచ్చాయి. 1995లో కేంద్రం నుంచి వనసేవా అవార్డు దక్కింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనేఅంతర్జాతీయ స్వచ్చంద సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను కూడా ప్రదానం చేసింది.

click me!