
చేనేతకు సాంకేతిక సాయంతో చేయూత నిచ్చిన చింతకింది మల్లేశంకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం పాఠశాల దశలోనే చదవు మానేశారు. చేనేత కార్మికుడిగా పనిచేస్తూనే చేనేతలో కొత్త పద్ధతులను ఆవిష్కరించారు.
2000 సంవత్సరంలో చేనేతకు సంబంధించి ఆయన కనుగొన్న ఆసు యంత్రం చేనేతలో ఓ విప్లవంగా పేర్కొనవచ్చు.
ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18 వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని రెండు చీరలు తయారు కావు.
కానీ, మల్లేశం తయారు చేసిన ఈ ఆసు యంత్రం వల్ల ఆ శ్రమ తప్పింది. రోజు రెండు చీరలు నేయడమే గగనమయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు 6 చీరలు నేసే స్థాయికి నేతన్నను ఈ యంత్రం తీసుకొచ్చింది.
తన తల్లి పేరు మీద ఈ మిషన్ కు లక్ష్మీ ఆసుయత్రం అని పేరు పెట్టారు మల్లేశం.
2011 సంవత్సరంలో దీనికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాల మల్లేశం పేరు వచ్చింది. ఆసుయంత్రానికి సాఫ్ట్ వేర్ సాయం అందిస్తామని అమెరికా సైతం ముందుకు వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయన శ్రమను గుర్తిస్తూ పద్మ అవార్డు కూడా ప్రకటించింది.