నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక: శేరి సుభాష్ రెడ్డికి ఓటు, కాంగ్రెస్ అభ్యంతరం

By narsimha lodeFirst Published Jan 28, 2020, 10:45 AM IST
Highlights

నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్నిక రోజుకో మలుపు తీరుగుతోంది. 


నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్  ఎన్నికల మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావుతో పాటు  టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలకు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేశారు అధికారులు. దీంతో నేరేడుచర్ల  మున్సిపాలిటీలో  కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్‌కు ఒక్క స్థానం అదనంగా పెరిగింది.

Also read:నేరేడుచర్లలో కేవీపి ఎఫెక్ట్: సూర్యాపేట కలెక్టర్ మీద బదిలీ వేటు

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి.ఈ వార్డుల్లో టీఆర్ఎస్‌కు 7, కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు దక్కాయి. సీపీఎం ఒక్క స్థానంలో విజయం సాధించింది.  నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీవీ రామచంద్రారావుకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్‌అఫిషియోసభ్యుడిగా ఓటు కల్పించడంపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 27వ తేదీన జరగాల్సిన మున్సిపల్ ఛైర్మెన్, వైఎస్ ఛైర్మెన్ ఎన్నిక వాయిదా పడింది.

Also Read: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు: ఉత్తమ్ తో గొడవ, మైక్ విరగ్గొట్టిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఈ పరిణామాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను కట్టబెట్టారు.

నేరేడుచర్ల  మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నికను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో నలుగురికి ఎక్స్ అఫిషియో సభ్యలుగా టీఆర్ఎస్ తమ ఓట్లను నమోదు చేసుకొంది. ఈ నెల 27వ తేదీకి టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుుడు బడుగుల లింగయ్యయాదవ్,  ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు,హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డిలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకొన్నారు.

అయితే ఈ నెల 28వ తేదీ ఉదయానికి టీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్సీ  శేరి సుభాష్ రెడ్డికి నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అవకాశం కల్పించారు. దీంతో నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ బలం 11, కాంగ్రెస్ బలం పదికి చేరింది. 

రాత్రికి రాత్రే టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి నేరేడుచర్ల ఓటు హక్కును కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి గడువు తీరిన తర్వాత  ఎక్స్ అఫిషియో సభ్యులను కొత్తగా ఎలా చేరుస్తారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 
 

click me!