టీఆర్ఎస్ నేత అత్యుత్సాహం.. అందరికీ కనిపించేలా గన్ పెట్టుకుని పబ్లిక్ లో... ఫొటో వైరల్...

By Bukka SumabalaFirst Published Sep 15, 2022, 6:34 AM IST
Highlights

ఓ టీఆర్ఎస్ నేత కరీంనగర్ లో అందరికీ కనిపించేలా గన్ జేబులో పెట్టుకుని తిరుగుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. 

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక టిఆర్ఎస్ నాయకుడు (ఎంపీపీ భర్త) టీ షర్టు వెనకభాగంలో బైటికి కనిపించేలా గన్ పెట్టుకున్న ఫోటో ఒరటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇటీవల ఓ కార్యక్రమంలో అందరికీ కనిపించేలా ఆయన వద్ద గన్ ఉన్న తీరు చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గంలో పలువురికి గన్ లైసెన్స్ లను ఇస్తున్నారని బిజెపి నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించిన నేపథ్యంలో ఈ ఫోటో వెలుగు చూడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఎమ్మెల్యే మాట్లాడటంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హుజురాబాద్ లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  హుజూరాబాద్ నియోజకవర్గంలో తాము విచ్చలవిడిగా గన్ లైసెన్స్ లు ఇస్తున్నాం అనేది అవాస్తవమని చెప్పారు. గత రెండేళ్లలో నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే గాని లైసెన్సులు జారీ చేశామని తెలిపారు. అందరికీ కనిపించేలా గన్ పెట్టుకుని తిరుగుతున్న నాయకుడిని హెచ్చరించానని చెప్పారు. మరోసారి ఇలా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

ఉదాసీన్ మఠానికి ఊరట.. కూకట్‌పల్లిలోని 540 ఎకరాల భూమిపై సుప్రీం కీలక తీర్పు

ఇదిలా ఉండగా, తనకు తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తెలంగాణ సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు. తనపై దాడి జరిగితే అది తెలంగాణ ప్రజలకు జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందని అన్నారు.  గతంలో కూడా తనపై దాడికి రెక్కీ నిర్వహించిన  విషయాన్ని రాజేందర్ గుర్తుచేశారు. అంతేకాదు తనను బెదిరించారని కూడా చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎన్ని బెదిరింపులు అయినా ఎదుర్కొంటానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

తాను స్పీకర్ ను మరమనిషి అంటే తప్పు అని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ మాటల గురించి ఏమంటారని ఆయన ప్రశ్నించారు. తిట్లనే తెలంగాణ భాషగా కెసిఆర్ చెప్పుకుంటారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా ఒక ఎమ్మెల్యేకు కూడా బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదన్నారు. ఈ విషయమై తాను ప్రశ్నించినట్లుగా తెలిపారు. ఇదే విషయాన్ని తమ ఎమ్మెల్యే రఘునందన్రావు అడిగినా స్పీకర్ నుండి స్పష్టత రాలేదని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఓడించేవరకు నిద్రపోనని ఈటెల రాజేందర్ ప్రకటించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. 

click me!