
హైదరాబాద్ కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో వున్న 540 ఎకరాల భూమి హక్కులపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్ట్. అత్యంత విలువైన ఆ భూములపై పూర్తి హక్కు దేవాదాయ శాఖ పరిధిలోని ఉదాసీన్ మఠానివేనని స్పష్టం చేసింది. ఈ కేసులో ఉదాసీన్ మఠానికి ప్రత్యర్ధిగా వున్న గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ వుంది. ఈ భూములను 1964, 1965, 1969, 1978లలో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్‌కు 99 ఏళ్ల పాటు ఉదాసీన్ మఠం లీజుకిచ్చింది. బఫర్ జోన్‌లో వున్న ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్.
దీనిని సవాల్ చేస్తూ ఉదాసీన్ మఠం, దేవాదాయ శాఖ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యూనల్ 2011లో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్‌కు ఇచ్చిన లీజును రద్దు చేసింది. ట్రిబ్యూనల్ తీర్పును సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. 2013లో ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది కోర్ట్. దీనిని సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. 2013లో స్టేటస్ కో ఇచ్చింది ధర్మాసనం. ఈ కేసులో ఇప్పుడు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్ట్. గల్ఫ్ ఆయిల్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కు.. దేవాదాయ శాఖకే వుందని స్పష్టం చేసింది.