
దేశానికి కొత్త రాజ్యాంగం ( new constitution) అవసరమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు (kcr) దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం టీ కాంగ్రెస్ (congress) ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యంగా అవతరించడానికి అంబేద్కర్ (br ambedkar) తన మేధా శక్తిని ధారపోసి అద్భుత కావ్యాన్ని దేశానికి అందించారని గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగం అవసరం లేదు.. రద్దు చేయాలని, అహంకార పూరితంగా , నియంత ఆలోచనతో కేసీఆర్ మాట్లాడారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ ముందు వుంటుందని ఆయన స్పష్టం చేశారు. చైనా, రష్యా అధ్యక్షులు తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకున్నారని రేవంత్ గుర్తుచేశారు. పదవులు వున్నాయని విర్రవీగితే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగం గొప్పదనం టీఆర్ఎస్ నేతలకు అర్థం కాదని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని ప్రజాస్వామికవాదులు గాడిద మీద పెట్టి ఊరేగించాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు తప్పు తెలుసుకుని క్షమాపణాలు చెబుతారనుకుంటే.. ఆయన దగ్గర పనిచేసే కడియం శ్రీహరి (kadiyam srihari) , కేశవరావు (k keshava rao) వంటి వ్యక్తులు కేసీఆర్‌ను సమర్ధిస్తూ మాట్లాడటం సరికాదన్నారు.
పదవుల కోసం ఇలా దిగజారడం పద్ధతికాదని రేవంత్ హితవు పలికారు. సీఎం అయినా.. ఎవరైనా ప్రజలకు సేవకులేనని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలకు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు ఎందుకు గళం విప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా వీధి నాటకాలు ఏంటంటూ బీజేపీ నేతలపై ఆయన ఫైరయ్యారు. బీఆర్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం.. కాంగ్రెస్ పార్టీకో, కాంగ్రెస్ నేతలకో కాదని ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ఆయుధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఈ రాజ్యాంగమే లేకపోతే.. ఈరోజు తాము ధర్నాలు చేసేవాళ్లమా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి వుండేది కాదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారానే ఈ రాష్ట్రానికి కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. సీఎం వ్యాఖ్యల వెనుక బీజేపీ, మోడీ హస్తం వుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అంతకుముందు ఇదే కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రమాదకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు హక్కులు కల్పించిన పవిత్ర గ్రంథం రాజ్యాంగమని భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు సైతం సమాన హక్కులు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగం అంటే రిజర్వేషన్ ఒక్కటే కాదని.. జీవన విధానమని భట్టి అన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, జీవించే హక్కులను రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగం లేకుంటే పాలనలో మనకు భాగస్వామ్యం వుండేది కాదని విక్రమార్క అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగం పనికి రాదు అని చెప్పడం అంటే నియంత ఆలోచనే అంటూ ఆయన దుయ్యబట్టారు. రాచరికం కోరుకునే వాళ్లే రాజ్యాంగం వద్దని అంటారంటూ భట్టి ఎద్దేవా చేశారు. ఇంత ప్రమాదకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలకు హక్కులు వద్దనే మాటలు రాజులు మాత్రమే చెబుతారంటూ భట్టి ఆరోపించారు. నేను మాత్రమే రాజ్యం ఏలాలి అనుకునే వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరని విక్రమార్క దుయ్యబట్టారు. రాజ్యాంగం పనికి రాదని చెప్పిన కేసీఆర్‌ను సీఎంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు రాష్ట్రపతి, గవర్నర్ చొరవ చూపాలని భట్టి కోరారు. రాజ్యాంగం గురించి తప్పుడు మాటలు మాట్లాడిన కేసీఆర్‌ను ఏం చేసినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు రాజ్యాంగం పనికిరాదని చెబుతున్నారంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.