
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ పలు ప్రశ్నలు సంధించారు రేవంత్ రెడ్డి. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు.
‘‘ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోంది.. నిలువెత్తు విగ్రహం నిలదీస్తోంది. దళిత బిడ్డల కాలే కడుపుల సంగతేంటని? దళితుడే తొలి ముఖ్యమంత్రన్న ద్రోహి ఎవరని? దళిత బిడ్డలకు మూడెకరాల భూమేదని? దళిత బంధు వచ్చిందెవరికి అని? సబ్ ప్లాన్ నిధులు ఏ పద్దుల కింద మాయమైపోయాయని.. సమాధానం చెప్పే ’’ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అంతకుముందు గురువారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ సంపదగా ప్రకటించిన కేబీఆర్ పార్క్ చుట్టూ మంత్రి కేటీఆర్ విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు . 2006లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టి పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించిందన్నారు. అయితే దీనిని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించి.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిబంధనలు పాటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధన పెట్టిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సత్యం రామలింగరాజుకు చెందిన మెటాస్ సంస్థతో పాటు మరో మూడు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి నిర్మాణ అనుమతులు దక్కించుకున్నాయని తెలిపారు. అయితే సత్యం కుంభకోణం కారణంగా మెటాస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్నారు.
Also Read: కేటీఆర్ విధ్వంసం, అవినీతి.. ఎపిసోడ్ 1కి బ్రేక్, ఎపిసోడ్‌లో 2లో అసలు కథ బయటపెడతా : రేవంత్ రెడ్డి
అయితే ఈ ప్రాజెక్ట్‌లోకి మంత్రి డెవలపర్స్ వచ్చి చేరిందని, అంతేకాకుండా 80 శాతం మంత్రి డెవలపర్స్ కొనుగోలు చేసిందన్నారు. తొలుత గ్రౌండ్ ప్లస్ టూ నిర్మాణాలకే అనుమతి వుండగా.. మంత్రి సంస్థ జీ ప్లస్ 7కి దరఖాస్తు చేసిందని రేవంత్ తెలిపారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ కన్ను ఈ ప్రాజెక్ట్‌పై పడిందని ఆయన ఆరోపించారు. అలా 2018, 2021లలో అదనపు ఫ్లోర్‌ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకుందని రేవంత్ చెప్పారు.
అయితే కేసుల్లో ఇరుక్కున్న రాజులు మరోసారి రంగ ప్రవేశం చేశారని.. ఈ క్రమంలో సత్యం రామలింగరాజుకు అత్యంత నమ్మకస్తుడైన వీర వెంకట రామారావు ‘‘ఆర్ అండ్ ఆర్’’ పేరిట సంస్థను ఏర్పాటు చేశారని రేవంత్ చెప్పారు. ఈ సంస్థ మంత్రితో కలిసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాల్గొందని ఆయన తెలిపారు. మొత్తం 200 ప్లాట్లు ఇక్కడ నిర్మిస్తున్నారని.. ఒక్కో ప్లాట్ ధర రూ.21 కోట్లు వుంటుందని రేవంత్ చెప్పారు. మొత్తంగా ఇది రూ.4000 కోట్ల ప్రాజెక్ట్ అని తెలిపారు. శ్రీమంతులు మాత్రమే ఇక్కడ ఫ్లాట్ కొనుగోలు చేయగలరని.. ఒక్కో ఇంటికి 5 కార్లు, 5 ఏసీలు పెడితే కేబీఆర్ పార్క్ పరిస్ధితి ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
🔥అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోంది..
నిలువెత్తు విగ్రహం నిలదీస్తోంది..
🔥దళిత బిడ్డల కాలే కడుపుల సంగతేంటని?
🔥దళితుడే తొలి ముఖ్యమంత్రన్న ద్రోహి ఎవరని?
🔥దళిత బిడ్డలకు మూడెకరాల భూమేదని?
🔥దళిత బంధు వచ్చిందెవరికి అని?
🔥సబ్ ప్లాన్ నిధులు ఏ పద్దుల కింద మాయమైపోయాయని?
సమాధానం చెప్పే… pic.twitter.com/3b1sJYxIlU