కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు హనుమాన్ చాలిసా పాడుతూ బిజెపి శ్రేణులు చేపట్టిన ఆందోళనలపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. అధికారంలోకి రాగానే హిందూ సంస్థ భజరంగదళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలో పెట్టిందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా హిందుత్వ సంస్థను నిషేధిస్తాన్న కాంగ్రెస్ కు తగిన బుద్ది చెబుతామంటూ తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యాలయాల వద్ద హనుమాన్ చాలిసా చదివి నిరసన తెలపాలన్న బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుమేరకు గాంధీ భవన్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా బిజెపి, భజరంగదళ్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఎంఐఎం పార్టీకి లొంగిపోయి, వంగిపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ హనుమాన్ చాలిసా గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. సచివాలయంలోని నల్లపోచమ్మ దేవాలయాన్ని కూల్చితే మాట్లాడనివారు... ఎంఐఎం మీద పోటీ చేయకుండా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వున్నవారికి ఇప్పుడు హనుమాన్ చాలిసా గుర్తుకువచ్చిందా అంటూ మండిపడ్డారు. ఎంఐఎంతో టచ్ లో వున్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కాంగ్రెస్ పై విమర్శలు చేయడం తగదన్నారు.
undefined
హనుమాన్ చాలిసా ప్రతి హిందువు చదవాల్సిందేనని... తాను కూడా చదువుతానని రేవంత్ అన్నారు. నిజంగానే హనుమాన్ చాలిసా చదవడానికే అయితే రండి... మా పార్టీ కార్యాలయం గాంధీ భవన్ మెట్ల మీదే కూర్చుని అందరం కలిసి చదువుకుందాం అని రేవంత్ అన్నారు. అంతేగానీ దేవుళ్ల పేరిట రాజకీయాలు చేయాలని చూడొద్దని బిజెపి నాయకులకు టిపిసిపి చీఫ్ సూచించారు.
Read More తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్‌దళ్ ఆందోళనలు.. గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం..
ఇదిలావుంటే ఈ నెల 8న హైదరాబాద్ సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు ప్రియాంకా గాంధీ హాజరవుతారని రేవంత్ ప్రకటించారు. గతంలో వరంగల్ లో రాహుల్ గాంధీ రైతులకు కోసం డిక్లరేషన్ ప్రకటించినట్లుగానే హైదరాబాద్ లో యువత కోసం ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ప్రకటిస్తామని అన్నారు. అందువల్లే సరూర్ నగర్ సభకు 'యువ సంఘర్షణ సభ' గా నామకరణం చేసినట్లు రేవంత్ వెల్లడించారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని... కానీ ప్రత్యేక రాష్ట్రంలోనూ 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు తప్ప ఇప్పటివరకు ఒక్క ఉద్యోగమైనా భర్తీ అయ్యిందా అని ప్రశ్నించారు. చివరకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు సంతలో సరుకుల మాదిరి వందల కోట్లకు అమ్ముకుంటూ లక్షలాది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెడుతున్నారని అన్నారు.కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు.