
హుస్నాబాద్ ఒకప్పుడు నీళ్లులేని ప్రాంతం అని.. ఇప్పుడు గోదావరి నీళ్లతో పరిస్థితి మారిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అనేకం అమలవుతున్నాయని చెప్పారు. కేసీఆర్ అపర భగీరథుడని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, మిడ్ మానేరు వరకు నీళ్లు వస్తున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు 6 గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయంలో కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని అన్నారు. ఇంటింటికి మంచినీరు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్షా 6 వేల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చిన ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌ను ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలను కోరారు. హుస్నాబాద్‌లో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ. 25 కోట్లు హుస్నాబాద్‌కు మంజూరు చేస్తున్నామని తెలిపారు. బండి సంజయ్‌కు ఎంపీగా ఉన్న నాలుగేళ్లు ఏం చేశాడో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. గడి కట్టింది లేదు.. బడి కట్టింది లేదని మండిపడ్డారు. మతాలను, పిల్లలను రెచ్చగొట్టడం తప్ప చేసిందేమి లేదన్నారు. ఇప్పటికైనా పిచ్చోడిని వదిలేసి మంచోడిని గెలిపించుకోవాలని అన్నారు. ఎంపీగా వినోద్ కుమార్‌ను గెలిపించాలని కోరారు. రూ. 400 ఉన్న సిలిండర్ ధరను రూ. 1,200 చేసిన ఘనత బీజేపీదేనని ఎద్దేవా చేశారు.