ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ.. ఇప్పటికీ మోడీ, కేసీఆర్‌లు చీకటి మిత్రులే : ప్రధాని వ్యాఖ్యలపై రేవంత్ స్పందన

Siva Kodati |  
Published : Oct 03, 2023, 09:39 PM IST
ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ.. ఇప్పటికీ  మోడీ, కేసీఆర్‌లు చీకటి మిత్రులే : ప్రధాని వ్యాఖ్యలపై రేవంత్ స్పందన

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. వారిద్దరూ చీకటి మిత్రులని.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుంచి చెబుతున్నామని రేవంత్ గుర్తుచేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వున్న ఫెవికాల్ బంధాన్ని సాక్షాత్తూ ప్రధాని తెలియజేశారని ఆయన వ్యాఖ్యానించారు. వారిద్దరూ చీకటి మిత్రులని.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుంచి చెబుతున్నామని రేవంత్ గుర్తుచేశారు. ఎన్డీయేలో కేసీఆర్ చేరాలనుకోవడం, కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నది నిజమని ఆయన వెల్లడించారు. 

ఇప్పటికీ  మోడీ, కేసీఆర్‌లు చీకటి మిత్రులేనని.. నిజం ఎప్పటికైనా నిగ్గుతేలక మానదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలని టీపీసీసీ చీఫ్ హెచ్చరించారు. గత 9 ఏళ్లలో మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కేసీఆర్ మద్ధతు వుందని.. పార్లమెంట్ రికార్డులే చెబుతున్నాయని రేవంత్ అన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీతో ఏం లాలూచీ పడ్డాడో ప్రధాని చెప్పిన తర్వాత తాము ప్రత్యేకంగా చెప్పేదేం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల చీకటి బంధాన్ని గుర్తుంచుకుని ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఓటర్లకు సూచించారు. 

అంతకుముందు నిజామాబాద్ జిల్లా ఇందూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని .. ఎన్డీయేలో చేరతామని అడిగారని తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించిందని ప్రధాని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలకడానికి వచ్చే వారని, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయిందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి బీజేపీకి ఇస్తానని కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను అడిగారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso Read: నేను సీఎం కావడానికి మీ పర్మిషన్ ఎందుకు .. మీరు భయపెడితే భయపడం : మోడీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ ప్రజల డబ్బును కర్ణాటకలో ఖర్చు పెట్టారని మోడీ ఆరోపించారు. దక్షిణ భారతదేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఆలయాల సంపదను తీసుకుంటున్నారని.. కానీ మైనార్టీ ప్రార్ధనా స్థలాల జోలికి మాత్రం వెళ్లరని దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని తాను చెప్పానని మోడీ గుర్తుచేశారు. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారని ప్రధాని ఆరోపించారు. 

కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారని.. ఇది రాజరికం కాదని తాను కేసీఆర్‌కు చెప్పానని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులు అని తాను చెప్పానని మోడీ వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది ఒకటే సిద్ధాంతమని.. ఎన్నికలకు ముందు వాగ్థానాలు ఇవ్వడం, ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోవడం వాళ్ల పాలసీ అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ డబ్బులు అందజేసిందని ప్రధాని ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే