ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ విచారణ అంశాన్ని తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
న్యూఢిల్లీ:ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఈడీ విచారణ కల్వకుంట్ల కుటుంబ సభ్యుల వ్యవహరమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అంశానికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.
గురువారంనాడు కవిత ఈడీ విచారణ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. ఇది కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన పంచాయితీగా ఆయన పేర్కొన్నారు. డబ్బుల పంపకాల్లో తేడాల వల్లే చిల్లర పంచాయితీలు బయటకు వచ్చాయని రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై ఆయన ఆరోపణలు చేశారు.కవిత అంశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల సమస్యగా చిత్రీకరించాలనుకుంటున్నారన్నారు. 78 ఏళ్ల వయస్సులో సోనియా గాంధీ ని ఈడీ అధికారులు విచారించారన్నారు.
also read:Delhi Liquor Scam: ఈడీ విచారణకు కవిత గైర్హాజర్ వెనుక వ్యూహమిదీ
డెక్కన్ హెరాల్డ్ పత్రిక విషయంలో రోజుల తరబడి సోనియా గాంధీని విచారించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈడీ విచారణ పేరుతో సోనియాగాంధీని మానసిక వేదనకు గురి చేశారన్నారు. అనారోగ్యంగా ఉన్న సమయంలో కూడా సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారించారన్నారు. సోనియా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలను తాము ఆనాడు ప్రపంచానికి అన్ని విషయాలను చెప్పే ప్రయత్నం చేశామన్నారు.
సోనియా గాంధీని విచారించే సమయంలో తాము ఈడీ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయించారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆనాడు సోనియాగాంధీని ఇబ్బంది పెట్టవద్దని బీఆర్ఎస్ నేతలు ఎందుకు కోరలేదో చెప్పాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సానుభూతి కోసం అర్రులు చాస్తే సానుభూతి దక్కదని ఆయన చెప్పారు.