మేడిగడ్డ పాపంలో మీ వాటా ఎంత .. నిన్నటి ప్రసంగంలో కాళేశ్వరం ప్రస్తావన ఏది : మోడీపై రేవంత్ ఆగ్రహం

మేడిగడ్డ కూలిన పాపంలో మోడీకి ఎంత భాగస్వామ్యం వుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతిపరుల పాటిట తాను చండశాసనుడినని మోడీ అన్నారని.. అవినీతిపరులను వదలనని చెప్పారని రేవంత్ ఎద్దేవా చేశారు.


టికెట్ రాని అసంతృప్తుల గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. టికెట్ రానివారిని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఆశావహులు ఎంతమంది వున్నా ఒక్కరికే టికెట్ ఇవ్వగలమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీళ్లను మళ్లీ గెలిపిస్తే ఆలి మీద వున్న తాళి కూడా గుంజుకుపోతారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.     

ఆదిలాబాద్ అభివృద్ధికి సాగునీరు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో నీళ్లు, నిధులు, నియామకాలు ఇచ్చారా అని రేవంత్ నిలదీశారు. మేడిగడ్డ వద్ద కట్టిన బ్యారేజ్ మేడిపండులాగా పగిలిపోయిందని.. ప్రాజెక్ట్‌ల పేరుతో లక్ష కోట్ల దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికే న్యాయం జరిగింది తప్పించి.. తెలంగాణ ప్రజలకు కాదని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే కేసీఆర్ కుటుంబం బాగుపడిందని.. కుంగిన మేడిగడ్డ, పగిలిన అన్నారంను చూడమని మోడీకి చెప్పానని ఆయన పేర్కొన్నారు. 

Latest Videos

అవినీతిపరుల పాటిట తాను చండశాసనుడినని మోడీ అన్నారని.. అవినీతిపరులను వదలనని చెప్పారని రేవంత్ ఎద్దేవా చేశారు. అవినీతిపరుల వద్దకు సీబీఐ, ఈడీ, ఐటీని పంపిస్తామని మోడీ చెప్పారని.. మేడిగడ్డ చూడకపోతే మీ పర్యటన వల్ల ఏం లాభమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ కూలిన పాపంలో మోడీకి ఎంత భాగస్వామ్యం వుందని తాను అడుగుతున్నానని ఆయన నిలదీశారు. మేడిగడ్డ గురించి మాట్లాడడు కానీ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై మోడీ మాట్లాడతారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడెం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లను కట్టింది కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చింది కాంగ్రెస్ కాదా అని రేవంత్ గుర్తుచేశారు. 

click me!