
ఉద్యోగ సంఘాల నేతలపై టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) ఫైరయ్యారు. ఉద్యోగుల సమస్యలపై సంఘాల నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఫైరయ్యారు. ప్రభుత్వ ఎజెండాను ఉద్యోగ సంఘాల నేతలు అమలు చేస్తున్నారని .. వారు కట్టుబానిసలుగా మారారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ సంఘాలకు (govt employee unions) గౌరవం లేదని.. ఇక అధ్యక్షులకు ఎక్కడదని అన్నారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న ఆయన... రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రికి ఎలాంటి ఆలోచన లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర మంత్రిపై హత్యకు కుట్ర జరిగితే సీఎం సమీక్ష చేయరా? విచారణలో ఉండగా పోలీసులు ఎలా మీడియా ముందుకు వచ్చి కేసు గురించి మాట్లాడతారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఎలక్షన్ అఫిడవిట్ వ్యవహారం విచారణలో ఉండగానే ఇవన్నీ జరుగుతున్నాయని.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇళ్లపై దాడులు ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
డీజీపీ మార్పు జరిగినప్పుడు ఇలాంటిది ఏదో జరగబోతోందని తాను ముందే చెప్పానని... దీనిపై నిజానిజాలు బయటికి రావాలంటే సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసుల మాటలు విశ్వసించేలా లేవని... తెలంగాణను మరో బిహార్‌లా మారుస్తున్నారని టీపీసీసీ చీఫ్ దుయ్యబట్టారు. తన వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ.. ఒత్తిడితోనే ప్రకటన విడుదల చేశారని, ఆయన మెడికల్ రిపోర్టులు బయట పెట్టలేదని ఎద్దేవా చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కూడా బిహార్ ముఠా చేతిలోనే ఉందని.. అందుకే ఖండిస్తున్నారని రేవంత్ అన్నారు. మిగతా అధికారులు ఎందుకు తన వ్యాఖ్యలను ఖండించడం లేద అని ఆయన నిలదీశారు.
కాగా.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు కుట్ర వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగుల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు మంత్రి హత్య పన్నగా తాము ఆ పన్నాగాన్ని భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల పక్షాన పోరాడిన శ్రీనివాస్ గౌడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంత్రి పదవిలో వున్నారని... అలాంటి వ్యక్తిని చంపాలనుకున్న అసలు కుట్ర దారులను శిక్షించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసి (telangana employees jac) నాయకులు పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను ఖండిస్తూ హైదరాబాద్ లో టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమయ్యింది. టీఎన్జీవో అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో నాంపల్లి లోని టీజీవో భవన్ లో నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని మంత్రికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఉద్యోగులు, అధికారుల సంక్షేమం కోసం తపించే శ్రీనివాస్ గౌడ్ ని చంపేందుకు కుట్ర పన్నిన వారిని వెంటనే గుర్తించాలని... కుట్ర వెనకున్న అసలు కారకులను కఠినంగా శిక్షించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ... శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన కుట్రను ఉద్యోగ సంఘాలతో పాటు ఎంప్లాయిస్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి కుట్రలు జరగడం దారుణమన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ పాలమూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకుని కాపాడుకోవడానికి ముందుగానే పసిగట్టి కుట్రను భగ్నం చేసిన పోలీస్ శాఖను అభినందిస్తున్నామని మమత పేర్కొన్నారు. ''మంత్రిపై జరిగిన కుట్రకు నిరసనగా మూడురోజులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని మమత తెలిపారు. మంత్రిపై కుట్రపన్నిన వారిని వెంటనే శిక్షించాలని రాష్ట్ర హోంమంత్రి, డిజిపిని కోరుతున్నామన్నారు. రాజాకీయంగా ఎదుర్కోకుండా ఇలా కుట్రలకు పాల్పడడం పిరికిపంద చర్యగా మమత పేర్కొన్నారు.