
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగిన కాల్పుల ఘటనను పోలీసులు చేధించారు. రియల్లర్లు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి హత్యల కేసులో మట్టారెడ్డి సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వీరిని సరూర్ నగర్ ఎస్‌వోటీ కార్యాలయంలో విచారిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో లేక్ వ్యూ విల్లా ఓనర్స్ అసోసియేషన్ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఇక, సుపారీ గ్యాంగ్‌తో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను మట్టారెడ్డి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇక, సపారీ గ్యాంగ్ సాయంతో మట్టారెడ్డి ఈ హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మట్టారెడ్డి, నవీన్ తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. వీరిని సాయంత్ర మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఇక, హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రాఘువేందర్ రెడ్డితో కలిసి పదెకరాల స్థలం కొన్నాడు. అయితే ఆ స్థలం తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశాడు. దీంతో మంగళవారం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి కలిసి స్థలం వద్దకు వెళ్లగా మట్టారెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే మట్టారెడ్డి అనుచరులతో కలిసి వారిద్దరిపై కాల్పులకు దిగాడు.