
ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితా విషయంలో ఆశావహులు ఎలాంటి అపోహలకు గురికావొద్దన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి . ఎంపిక చేసిన వారి జాబితాను సీల్డ్ కవర్‌లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని ఆయనత తెలిపారు. ఈ కమిటీ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే వుంటుందని.. సోమవారం వేర్వేరుగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటుందన్నారు. డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో సమావేశమవుతుందని.. ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పీఈసీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
స్క్రీనింగ్ కమిటీ తయారు చేసిన జాబితా.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తుందని, అతి త్వరలోనే మొదటి జాబితా విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ చెప్పారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్ అని, చివరి నిమిషం వరకు తనకు కూడా సమాచారం వుండదన్నారు. ఈసారి బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నామని.. స్థానిక పరిస్ధితులు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ALso Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ జాబితా ఆలస్యమయ్యే ఛాన్స్, కారణమిదే..?
కాగా.. అభ్యర్ధుల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సమావేశాలు ముగిసిన తర్వాతే ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ రెండో వారంలోనే అభ్యర్ధుల ప్రకటన ప్రకటించే అవకాశం వుంది. మరోవైపు టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ రేపు ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. మరోవైపు ఆదివారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని నేతలు కోరారు.