ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఆరు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా పాలనను నాలుగు నెలలకు ఒకసారి సమీక్షిస్తారని సీఎం చెప్పారు. నిన్న ఏపీలో నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిలా రెడ్డి క్రిస్మస్ గిఫ్టులు పంపింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమావేశం నిర్వహించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అర్హులైన వారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని, ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రశీదు ఇస్తారని పేర్కొన్నారు. ఇందులో మహాలక్ష్మీ, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు పథకాలను ఉమ్మడిగా దరఖాస్తు చేయవచ్చు.
వైఎస్ షర్మిల:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆమె క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపించారు. ఆ గిఫ్ట్‌ను స్వీకరించిన నారా లోకేశ్ ఫొటో తీసి ట్వీట్ చేశారు. క్రిస్మస్ గిఫ్టులు పంపినందుకు ధ్యవాదాలు తెలిపారు. ఆమెకు నారా కుటుంబ సభ్యుల తరఫున శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి పార్టీ టీడీపీ అగ్రనేతకు ఆమె గిఫ్ట్‌లు పంపించడం చర్చనీయాంశమైంది.
డబ్ల్యూఎఫ్ఐ సస్పెండ్:
భారత రెజ్లింగ్ సమాఖ్యకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. కీలకమైన టాప్ రెజ్లర్లు నిరసనకు దిగారు. ఎట్టకేలకు డబ్ల్యూఎఫ్ఐకి కొత్తగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్‌కు విధేయుడని తేలడంతో మరోమారు మల్లయోధులు నిరసనకు దిగారు. దీంతో క్రీడా శాఖ నూతన సమాఖ్యను సస్పెండ్ చేసింది.
Also Read: Christmas: క్రీస్తు పుట్టిన బెత్లేహంలో క్రిస్మస్ వేడుకల్లేవ్!.. ఎందుకంటే?
50 లక్షల కోట్ల సంపద సృష్టించాం: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలు తప్పుల తడకలని, శుద్ధ అవాస్తవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 6.71 లక్షల కోట్లు అప్పు అయిందని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో రూ. 50 లక్షల సంపద సృష్టించామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో స్వేదపత్రం పేరిట కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
క్రీస్తు పుట్టిన బెత్లేహంలో క్రిస్మస్ వేడుక లేదు:
క్రైస్తవులు పవిత్రంగా భావించే బెత్లేహం వేడుకలు మరింత ఆధ్యాత్మిక చింతనతో జరుగుతాయి. ఎందుకంటే జీసస్ క్రీస్తు బెత్లేహంలో జన్మించాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. కానీ, ఈ ఏడాది బెత్లేహంలో క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా భీకర యుద్ధం జరుపుతున్న తరుణంలో బెత్లేహంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం లేదు. ఈ సారి చాలా తక్కువ మంది విశ్వాసులు ఉండే అవకాశం ఉన్నది. ఒక్క క్రిస్మస్ ట్రీ కూడా ఏర్పాటు చేయకుండా.. ఈ సారి తోటి గాజా పౌరులకు సంఘీభావంగా ఈ విషాద సమయంలో క్రిస్మస్ జరుపుకోవడం లేదని చర్చి లీడర్లు ప్రకటించారు.