ఖమ్మం ఎంపీ టికెట్ : కాంగ్రెస్‌లో ‘ పోరు ’.. రేసులో పొంగులేటి సోదరుడు, కర్చీఫ్ వేసేశానంటోన్న రేణుకా చౌదరి

By Siva Kodati  |  First Published Dec 24, 2023, 9:17 PM IST

ఖమ్మం లోక్‌సభ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్ధుల వేట ప్రారంభించింది . మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో వున్నారు . రేణుకా చౌదరి సైతం ఖమ్మం టికెట్ కోసం పట్టుబడుతున్నారు.


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసింది. మూడోసారి అధికారాన్ని అందుకోవాలనుకున్న కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ విజయం సాధించింది. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు గడ్డపై హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఊపిరీ పీల్చుకుంది. అయితే సహజంగానే ఆ పార్టీలో సీఎం క్యాండిడేట్లు ఎక్కువ కావడంతో గెలిచిన సంతోషం ముణ్ణాళ్ల ముచ్చటే అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా యాక్షన్‌లోకి దిగి రెండు రోజుల్లోనే సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించి షాకిచ్చింది. సీనియర్లు మధ్యలో తోక జాడించేందుకు యత్నించినా ఆదిలోనే కట్ చేసింది. ఆ వెంటనే మంత్రులను కూడా కన్ఫర్మ్ చేసి చాలా స్పీడ్‌గా ప్రమాణ స్వీకారం చేయించింది. 

సీఎంగా పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డి పాలనపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పాత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులను పీకేసి తన టీమ్‌ను నియమించుకుంటున్నారు. మధ్య మధ్యలో ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌కు రిపోర్ట్ ఇచ్చి వస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ఆరు హామీల్లో రెండు హామీలను కూడా నెరవేర్చింది రేవంత్ ప్రభుత్వం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచింది. మిగిలిన హామీలను కూడా నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి నడుం బిగించారు. 

Latest Videos

ఇదిలావుండగా మరికొద్దినెలల్లో లోక‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో కాంగ్రెస్‌ కర్ణాటక తర్వాత తెలంగాణపై ఆశలు పెట్టుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్‌కు 7 నుంచి 10 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశం వుందని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరుపైనే జనం తీర్పు చెప్పనున్నారు. ఈ సంగతి పక్కనబెడితే.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు బయటి నుంచి వచ్చినవారు టికెట్లు కోరుతున్నారు. కొన్ని నియోజకవర్గాల టికెట్లకు భారీ డిమాండ్ వుంది. అందులో ఖమ్మం సెగ్మెంట్ ఒకటి.

ఖమ్మం తొలి నుంచి కాంగ్రెస్ కంచుకోట. అందుకే ఖచ్చితంగా గెలుస్తామన్న గ్యారెంటీ వుండటంతో ఈ సీటు కోసం పోటీ అధికంగా వుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోయింది. మొత్తం 10 స్థానాలకు గాను కాంగ్రెస్ 9 చోట్ల , సీపీఐ ఒక చోట గెలిచింది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో అత్యధికంగా ముగ్గురు మంత్రులు ఈ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో కాంగ్రెస్ గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. అందుకే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను వీరిపైనే పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ స్థానానికి అభ్యర్ధుల వేట ప్రారంభమైంది. దీనికి తోడు నేతల మధ్య పోరు కూడా అదే స్థాయిలో వుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో వున్నారు. తన సోదరుడితో పాటు కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి ప్రసాద్ రెడ్డి తీవ్రంగా శ్రమించి మంచి మార్కులు కొట్టేశారు. ఈ క్రమంలోనే ఆయన ఖమ్మం లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల మద్ధతు కూడా ప్రసాద్ రెడ్డికి దండిగా వుంది. పొంగులేటి కుటుంబానికి ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టుండటం ఆయనకు అదనపు బలం. 

ఇక.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సైతం ఖమ్మం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆమెకు ఖమ్మం టికెట్‌పై హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తన పోటీ కన్ఫర్మ్ అనే ఫీలింగ్‌లో ఫైర్ బ్రాండ్ వున్నారు. రేణుకతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. మరి వీరిలో హైకమాండ్ ఎవరిపై కరుణ చూపుతుందో తెలియాల్సి వుంది. 

click me!