Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్. న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసుల ఆంక్షలు, హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం, మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు, త్వరలో మెగా డీఎస్సీ, కొనసాగుతున్న ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలు వివాదం, ప్రధానికి పవన్ సంచలన లేఖ, టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహుర్తం, మరోసారి తిరుమలలో చిరుత సంచారం, ఖేల్ రత్నా, అర్జునా అవార్డులను ఫుట్‌పాత్ పై వదిలేసిన రెజ్లర్ వినేశ్ ఫోగట్, మహిళ టీమిండియాపై ఆసీస్ విజయం వంటి పలు వార్తల సమాహారం.
Today Top Stories: 'ప్రజాపాలన'కు రెండు రోజులు బ్రేక్..
Praja Palana: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా పాలన పేరుతో ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వాస్తవానికి డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే..తాజాగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి కాస్తా బ్రేక్ పడింది. 31వ తేదీ (ఆదివారం), 1వ తేదీ (సోమవారం) రెండు రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. తిరిగి 02వ తేదీ నుంచి 06 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 28వ తేదీన ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రజలు దరఖాస్తుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యాంరటీల లబ్ధిదారుల ఎంపికంలో భాగంగా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
న్యూఇయర్ వేడుకల వేళ పోలీసుల ఆంక్షలు.. పలు ఫ్లైఓవర్ల మూసివేత..
New Year Celebrations: మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 31, డిసెంబర్ 2023, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్స్, ఫ్లైఓవర్ల మూసివేత, సాధారణ పౌరులు అనుసరించాల్సిన నిబంధనలతో పాటు ఈవెంట్స్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను విడుదల చేశారు. వేడుక సమయాల్లో అంతరాయాలను తగ్గించే లక్ష్యంతో ఔటర్ రింగ్ రోడ్ (ORR)ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. PVNR ఎక్స్‌ప్రెస్‌వేలను యాక్సెస్ చేయకుండా ఆంక్షలు విధించారు. కేవలం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వైపు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 నుంచి ఉదయం ఉదయం 5 గంటల వరకు పలు ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. వీటిలో శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (ఫేజ్ I మరియు II), షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్, ఫోరమ్ మాల్-JNTU, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్ రామ్ (బాలానగర్), AMB, కొండాపూర్ ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. ఈ నిషేధిత సమయాల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే
TS SSC Exams 2024:తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ (Tenth exams ) విడుదలైంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎస్ఎస్సీ) శనివారం (డిసెంబర్ 30) సాయంత్రం పదో పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యాశాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. SSC పరీక్షలు మార్చి 18 (సోమవారం) ప్రారంభమై.. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. అభ్యర్థులందరూ తమ తమ పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూసుకోవాలని సూచించారు.
విద్యాశాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. 18న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, కాంపోజిట్ కోర్సు), 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 23న మ్యాథ్స్, 26న సైన్స్ పేపర్ 1 (ఫిజిక్స్), మార్చి 28న సైన్స్ పేపర్ 2 (బయోలజీ), 30న సోషల్ స్టడీస్, 1వ తేదీన ఒకేషనల్ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్, 2న రెండవ పేపర్ పరీక్షలు జరుగనున్నాయి.
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
Hyderabad Metro: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం రాత్రి మెట్రో పనివేళలను పెంచుతున్నట్టు హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడుపుతామని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ప్రకటించారు. చివరి రైళ్లు జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 12.15 గంటలకు చివరి రైలు బయలు దేరనున్నది. ఇలా అర్థరాత్రి ఒంటి గంటలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తామని ప్రకటించారు. అయితే.. మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించకుండా మెట్రో రైల్ పోలీసులు, భద్రతా విభాగాలు నిశితంగా గమనిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా బడి నడవాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ముదిరిన ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలు వివాదం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేసి విజయవాడలో దాచి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ల్యాండ్ క్రూయిజర్ల కొనాలన్నది భద్రతా విభాగం నిర్ణయమని అన్నారు. సీఎం, మంత్రులు, ఇతర వీఐపీల భద్రతా ఏర్పాట్లను పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు చూసుకుంటాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ విషయాల్లో రాజకీయ నాయకుల పాత్ర లేదని అన్నారు. ఏ సీఎం ప్రోటోకాల్ అయినా అంతిమంగా భద్రతా విభాగం, ఇంటెలిజెన్స్, పోలీసులే నిర్ణయిస్తారని తెలిపారు. ఏ నాయకుడు కూడా తనకు ఇన్ని వాహనాలు కావాలని కోరుకోరని తెలిపారు. ఇందులో భాగంగానే భద్రతా విభాగం అధికారులే ల్యాండ్ క్రూయిజర్లు కొనాలని నిర్ణయించారని తెలిపారు.
ప్రధాని మోడీకి జనసేనాని సంచలన లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నదని, వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పేదలకు సొంతిళ్లు పేరుతో కేవలం స్థలాల పేరుతో రూ. 35,141 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఇందులో భఆరీ మొత్తంలో గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ. 1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ. 91,503 కోట్లు అని చెబుతున్నదని కామెంట్ చేశారు.
టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఎప్పుడంటే...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలూ ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. ఒక పార్టీలో టికెట్ దొరకదని తెలిస్తే.. మరోపార్టీలోకి మారుతున్నారు నేతలు. ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గరపడుతున్నకొద్దీ పార్టీలు మారేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతోపాటే కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అలానే ఎన్నికలకు ప్రధానమైన మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టో పై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేస్తుంది. ఇరుపార్టీల పొత్తు రావడంతో ఏ నియోజకవర్గాల్లో సీట్లు వస్తాయో, ఏ నియోజకవర్గాల్లో రావో తెలియని పరిస్థితి. ఇప్పటికే జనసేన 45 సీట్లు అడుగుతోంది. కానీ 24నుంచి 28 సీట్లు మాత్రమే ఇవ్వాలని టీడీపీ చూస్తుంది. వీటితో పాటు జనసేనకు మూడు ఎంపీలు కేటాయించాలనే యోచనలో ఉంది. మరోవైపు వీరిద్దరితో.. బీజేపీ కలిస్తే ఇంకొన్ని సీట్లు జనసేనకు తగ్గే అవకాశం ఉంది.
మరోసారి తిరుమలలో చిరుతల అలజడి
ప్రముఖ దేవస్థానం తిరుమలలో మరో సారి చిరుతల అలజడి కలకలం రేకెత్తిస్తోంది. అలిపిరి నడక మార్గంలో వారి సారి చిరుత కదలికలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్టు తెలిసింది. గతంలో చిన్నారి లక్షితపై చిరుత పులి దాడి చేసిన ప్రాంతంలో వాటి కదలికలు ఉన్నట్టు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఈ నెల 13, 26వ తేదీల్లో చిరుత, ఎలుగుబంటి సంచారం అందులో కనిపించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తం అయ్యింది. నడక మార్గంలో వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భక్తులు ఒంటరిగా కాకుండా, గుంపులు గుంపులుగా రావాలని కోరింది.
టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం.. రిచా పోరాటం వృథా
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఖేల్ రత్నా, అర్జునా అవార్డులను తిరిగి ఇచ్చేసిన మహిళ రెజ్లర్
Vinesh Phogat: ఖేల్ రత్నా, అర్జునా అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన నాలుగు రోజులకు రెజ్లర్ వినేశ్ ఫోగట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, వాటిని ఫుట్ పాత్ పై వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. రెజ్లర్స్ బాడీపై రెజ్లర్లు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా వ్యవహరించిన బ్రిజ్ భూషణ్ శరణ్ పై రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై కొందరు మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు.
అయినా.. ఆయనపై చర్యలు తీసుకోకపోవడంతో వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా వంటి ఖిలాడీలు ఆందోళన ఉధృతం చేశారు. జంతర్ మంతర్ వద్ద కూడా వారు ధర్నా చేశారు. ఎట్టకేలకు డబ్ల్యూఎఫఐకి ఎన్నికలు నిర్వహించారు. అయితే.. ఈ ఖిలాడీలు సపోర్ట్ చేసిన అభ్యర్థిపై బ్రిజ్ భూషణ్ శరణ్‌కు సన్నిహితంగా ఉండే సంజయ్ సింగ్ గెలిచారు.