New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ట్రాఫిక్ డైవర్షన్స్, ఫ్లైఓవర్ల మూసివేత, సాధారణ పౌరులు అనుసరించాల్సిన నిబంధనలతో పాటు ఈవెంట్స్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను విడుదల చేశారు.
New Year Celebrations: మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 31, డిసెంబర్ 2023 నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్స్, ఫ్లైఓవర్ల మూసివేత, సాధారణ పౌరులు అనుసరించాల్సిన నిబంధనలతో పాటు ఈవెంట్స్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను విడుదల చేశారు.
వేడుక సమయాల్లో అంతరాయాలను తగ్గించే లక్ష్యంతో ఔటర్ రింగ్ రోడ్ (ORR)ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. PVNR ఎక్స్‌ప్రెస్‌వేలను యాక్సెస్ చేయకుండా ఆంక్షలు విధించారు. కేవలం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వైపు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు.
ఫ్లైఓవర్ల బంద్
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 నుంచి ఉదయం ఉదయం 5 గంటల వరకు పలు ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. వీటిలో శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (ఫేజ్ I మరియు II), షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్, ఫోరమ్ మాల్-JNTU, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్ రామ్ (బాలానగర్), AMB, కొండాపూర్ ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. ఈ నిషేధిత సమయాల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
సైబరాబాద్ వ్యాప్తంగా రాత్రంతా బ్రీత్ ఎనలైజర్ తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులు వారి లైసెన్సులను జప్తు చేసి సస్పెన్షన్ కోసం రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి పంపుతారు. రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన హారన్, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్ / మల్టిపుల్ రైడింగ్ వంటివి సహించబడవు. కఠినమైన చట్టపరమైన చర్యలను తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అలాగే.. బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో.. న్యూఇయర్ వేడుకల్లో మద్యం సేవించిన వారు స్వయంగా వాహనాలు నడిపేందుకు అనుమతించొద్దని పేర్కొన్నారు. ఒకవేళ అలా చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనలకు ప్రజలు సహకరించి బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. వ్యక్తులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని తెలిపారు.