పేదోళ్ల బడులంటే ఇంత చులకనా

First Published Jun 21, 2017, 10:47 AM IST
Highlights

తెలంగాణలో పేద పిల్లలు చదువుకు సర్కారు బడులంటే ఎంత చులకనో ఈ సంఘటన రూజువు చేస్తోంది. పాలకులు పైకి అంకెల గారడీలు చేస్తున్నా సర్కారు పాఠశాలల్లో కనీస సౌకర్యాలకు దిక్కుమొక్కు లేదని తేలిపోయింది. కెజి టు పిజి ఉచిత విద్య అంటూ ఊదరగొట్టే మాటలు నీటిమీద రాతలుగా మారుతున్నాయి. బంగారు తెలంగాణలో సర్కారు బళ్లలో ఉన్న దుస్థితిపై స్వయంగా ఓ ఎమ్మెల్యే విస్మయం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంలోని కవాడిగూడ  ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మన్ వచ్చారు. వచ్చీ రాగానే ఆయన అక్కడ పరిసరాలు చూసి షాక్ కు గురయ్యారు. పాఠశాలకు మంజూరైన మరుగుడొడ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చిందని ఆయన స్కూల్ సిబ్బందిని అడిగారు. దానికి వారు మరుగుదొడ్ల నిర్మాణం పనులు మొదలే కాలేదని సమాధానమిచ్చారు.

 

స్కూల్ సిబ్బంది ఇచ్చిన సమాధానంతో ఆశ్యర్యపోయిన ఎమ్మెల్యే లక్ష్మన్ వెంటనే డిఇఓ రమేష్ కు ఫోన్ చేశారు. కవాడిగూడ పాఠశాలలో మరుగుడొడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే. తమవద్ద మరుగుదొడ్ల నిర్మాణం చేసే సిబ్బంది లేదని డిఇఓ సమాధానమిచ్చారు. దీంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్ కు ఫోన్ చేశారు లక్ష్మణ్. ఆయన నుంచి కూడా సరైన సమాధానం రాలేదు.

 

దీంతో ఏకంగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి ఫోన్ చేశారు లక్ష్మణ్. ‘అన్నా ముషీరాబాద్ నియోజకవర్గంలోని  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం 6 నెలల క్రితమే 4 కోట్లు మంజూరు చేశారు. అయినా ఇప్పటి వరకు ఒక్క పనీ మొదలు కాలేదు ఎందుకకకే అని ప్రశ్నించారు.

 

అందుకు కడియం శ్రీహరి స్పందిస్తూ...‘లక్ష్మణ్‌..నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేయమని 60కోట్ల రూపాయలు మంజూరు చేసినా పనులు ఇప్పటికీ జరగడం లేదు ఏం చేస్తాం, కొన్ని  సమస్యలు ఉన్నాయి. అయినా నువ్వు  చెప్పినవు కాబట్టి ఈ పనిని వెంటనే పూర్తి చేయిస్తా‘ అని మంత్రి సమాధానమిచ్చారు.

 

మొత్తానికి బంగారు తెలంగాణలో సర్కారు బళ్లు ఇలా ఉన్నాయని ఎమ్మెల్యే లక్ష్మణ్ అసహనం వ్యక్తం చేశారు.

click me!