బంగారం వద్దు.. నగదే కావాలంటూ వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఆ తరువాత బాధితురాలి ఫోన్ నుంచే క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అలా వెళ్లిన నిందితుడు షాద్ నగర్ లో చాలాసేపు ఉన్నట్లు తేలింది.
హైదరాబాద్ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ వ్యాపారి ఇంట్లో గర్భిణి, ఆమె తల్లిని బెదిరించి రూ.10లక్షల నగదుతో ఓ దొంగ పరారైన సంగతి తెలిసిందే. ఈ దొంగతనం కేసులో నాలుగు రోజుల తరువాత పోలీసులు పురోగతి సాధించారు. జూబ్లీహిల్స్‌లోని గర్భిణీ స్త్రీని బంధించి, ఆమెను, ఆమె తల్లిని కత్తితో బెదిరించి... నగదుతో పారిపోయిన నిందితుడు ఆ తరువాత షాద్‌నగర్‌లో రెండు గంటలపాటు గడిపినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
విచారణలో, నేరం చేసిన సమయంలో దొంగ బాధితుల ఇంట్లో మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం కొన్ని ఆధారాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న దొంగను పట్టుకునేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నగదు చేతికి వచ్చిన తరువాత.. బాధితురాలి ఫోన్‌తో క్యాబ్ బుక్ చేసుకున్న నిందితుడు షాద్‌నగర్‌లో దిగి అక్కడ టీ తాగి ఆ ప్రాంతంలో కాసేపు తిరిగాడని సమాచారం. అంతేకాదు ఓ బట్టల షాపుకు కూడా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దొంగతనం తరువాత క్యాబ్ లో షాద్‌నగర్‌కు చేరుకున్న తర్వాత తాను వేసుకున్న జాకెట్ మార్చుకున్నాడు. అక్కడ వేరే వ్యక్తులతో మాట్లాడినట్లు కూడా తేలిందని పోలీసులు తెలిపారు.
బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా దొంగ తెలిసి ఉండవచ్చని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. "అతను నేరం చేసిన రోజు, బాధితురాలిని నాలుగేళ్ల చిన్నారి గురించి అడిగాడు. బాధితురాలి సోదరికి అదే వయస్సు ఉన్న అమ్మాయి ఉంది" అని పోలీసులు తెలిపారు. అయితే, దొంగ యాదృచ్ఛికంగా ప్రశ్నించాడా లేదా ముందస్తు సమాచారంతో అడిగాడా అనేది మిస్టరీగా ఉంది.
మే 12 ఉదయం నిందితుడు బాధితురాలి ఇంటి రెండో అంతస్తులోకి ప్రవేశించిన దొంగ.. గర్బిణి మెడమీద కత్తి పెట్టి డబ్బు కోసం బెదిరించాడు. ఆమె భర్త సాయంతో 8 లక్షలు సమకూర్చింది.