Hanamkonda: వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి బలయ్యాడు. తెలంగాణలో ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల దాడిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన వారి సంఖ్య అధికంగానే ఉంది.
Stray Dogs Attack: తెలంగాణలో కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకెళ్తే.. ఎనిమిదేళ్ల బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి చంపిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ ఘటన హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. చెట్టు కింద ఒంటరిగా నిద్రిస్తున్న బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. ఆ బాలుడు తప్పించుకోలేక అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడిని ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కూలీల కుమారుడు ఛోటుగా గుర్తించారు. గురువారం రాత్రి కాజీపేట రైల్వేస్టేషన్ కు వచ్చిన కుటుంబ సభ్యులు సమీపంలోని పార్కులో నిద్రించారు. బాలుడు పడుకుని ఉన్న క్రమంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ ఒంటరిగా ఉన్న బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తిరిగి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. వారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.
undefined
దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అజ్మీర్ వెళ్తున్న ఆ కుటుంబం గురువారం రాత్రి కాజీపేటకు వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి ఆస్పత్రిని సందర్శించి బాలుడి తల్లిదండ్రులను ఓదార్చారు. పోలీసులు ఛోటు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
కాగా, కాజీపేట రైల్వేస్టేషన్ లోని ప్లాట్ ఫాంపై వీధికుక్కల గుంపు సంచరిస్తున్న వీడియోలు ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసింది. ఈ క్రింది వీడియో మార్చిలో ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఆయా పరిసరాల్లో ఇప్పటికీ కుక్కల సంచారం అధికంగా ఉందని సమాచారం.
కుక్కలతో ప్రమాదకరంగా మారిన కాజిపేట్ రైల్వేస్టేషన్...
Kazipet railway station became dangerous with Dogs... pic.twitter.com/Sn4qd9Ss2B
తెలంగాణలో ఇలాంటి వరుస వీధి కుక్కల దాడుల ఘటనల్లో ఇది తాజాది. గత నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల దాడుల్లో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. వరంగల్ జిల్లాలో ఇది రెండో ఘటన. గత నెలలో వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ లో ఫిబ్రవరి 19న వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి తండ్రి వాచ్ మెన్ గా పనిచేస్తున్న కారు సర్వీసింగ్ సెంటర్ లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
అలాగే, ఖమ్మం జిల్లాలో మార్చిలో కుక్కల దాడిలో గాయపడి.. రేబిస్ వ్యాధితో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. వీధి కుక్కల కాటుకు గురైన అతడికి ఆ తర్వాత రేబిస్ లక్షణాలు కనిపించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వరుస ఘటనలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. హైదరాబాద్ లో ఫిబ్రవరి 19న జరిగిన ఘటన తర్వాత వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు అనేక చర్యలు ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపలేదని పౌరులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి.