
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆయనకు ఫోన్ వెళ్లిందని, ఢిల్లీ పెద్దలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారనీ తెలిసింది. అయితే.. దానికి తమ్మారెడ్డి భరద్వాజ ఇంకా రియాక్ట్ కాలేదని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక వారం రోజుల సమయం అడిగాడని, ఆలోచించుకుని చెబుతానని సమాధానం ఇచ్చినట్టు ఆ వర్గాలు వివరించాయి.
తమ్మారెడ్డి భరద్వాజకు కమ్యూనిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది. ఆయన సోదరుడు లెనిన్.. జార్జిరెడ్డి క్లాస్ మేట్. ఉస్మానియా విద్యార్థి. కమ్యూనిస్టు భావజాలం కలవారు. తమ్మారెడ్డి భరద్వాజది కూడా ఇదే భావజాలం అని చెబుతుంటారు. అయితే.. ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ, ఏ సమస్య అయినా.. ముఖ్యంగా పరిశ్రమలోని ప్రతి అంశంపైనా ఆయన నిక్కచ్చిగా స్పందిస్తుంటారు.
అన్ని పార్టీలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీల నేతలతోనూ సఖ్యత ఉన్నది. దాదాపు అన్ని పార్టీలు ఆయనను ఆహ్వానించాయి. కానీ, ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆహ్వానించింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకున్న కాంగ్రెస్ తమ్మారెడ్డిని ఆహ్వానించి మరింత బలోపేతం కావాలని యోచిస్తున్నది.
Also Read: పొత్తులపై కామ్రేడ్ల స్పష్టత.. కుదిరితే బీఆర్ఎస్‌తో లేదంటే కమ్యూనిస్టు పార్టీలే జట్టుగా
తమ్మారెడ్డి భరద్వాజకు చాలా విషయాల్లో స్పష్టత ఉన్నది. సాధికారత సమాచారం ఆయన సొంతం. ఎన్నో కీలక మలుపుల్లో ఆయన సొంతంగా పాల్గొన్న అనుభవాలు ఉన్నాయి. అందుకే ఆయనను పార్టీలోకి తీసుకుంటే అధికారపార్టీని ప్రశ్నలతో ఇరుకునపెట్టగలడని కాంగ్రెస్ భావిస్తున్నది. అయితే.. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేవు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.