చదువుల ఒత్తిడి భరించలేక... వ్యక్తిగత కారణాలతో చనిపోతున్నానంటూ తల్లికి మెసేజ్ పెట్టి ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ : ఇటీవల కాలంలో చిన్నపిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరం. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఓ 10వ తరగతి విద్యార్థి 35వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మాదాపూర్ ఏసీబీ శ్రీనివాసరావు ఈ మేరకు వివరాలు తెలిపారు..
రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో ఉన్న మై హోమ్ భుజలో హెచ్ టవర్ ఆరవ అంతస్తులో ఉన్న 604 ఫ్లాట్లో ఏం సురేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితమే మై హోమ్ భూజకు వచ్చారు. సురేష్ కుమార్ రెడ్డి ముంబైలోని ఓ కంపెనీలో ఫైనాన్షియల్ ఎనలిస్ట్ గా పని చేస్తున్నారు. కుటుంబాన్ని ఇక్కడ మై హోమ్ భూజలో ఉంచి.. ఆయన మాత్రం వీకెండ్స్ లో వచ్చి పోతుంటారు.
undefined
రేపే హైద్రాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం: సర్వం సిద్దం, 40 వేల మందితో పోలీస్ బందోబస్తు
సురేష్ కుమార్ కు భార్య స్వరూప, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు రియాన్ష్ రెడ్డి (14) ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, సోమవారం సాయంత్రం ఏడు గంటల 45 నిమిషాలకు తల్లి స్వరూప ఫోన్ కు మెసేజ్ పెట్టాడు రియాన్ష్ రెడ్డి. వ్యక్తిగత కారణాలతో తాను చనిపోతున్నానంటూ అందులో తెలిపాడు. ఆ తర్వాత ఫ్లాట్ నుంచి బయటికి వెళ్లిపోయాడు.
కాసేపటికి మెసేజ్ చూసుకున్న స్వరూప.. కంగారుపడి రియాన్ష్ రెడ్డి రెడ్డి కోసం ఫ్లాట్స్ మొత్తం వెతికింది, అపార్ట్మెంట్లో ఆరాతీసింది. కానీ, రియాన్ష్ రెడ్డి కనిపించలేదు. దీంతో అర్ధరాత్రి రెండున్నర గంటలు దాటిన తర్వాత రియాన్ష్ రెడ్డి కనిపించడం లేదంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే వారి అపార్ట్మెంట్స్కు చేరుకున్నారు.
అక్కడ అపార్ట్మెంట్ ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. అయినా, అతని ఆచూకీ తెలియ రాలేదు. అపార్ట్మెంట్లో అణువణువు శోధించారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో జే బ్లాక్ లోని గేటు దగ్గరున్నమెట్ల మధ్యలో ఉన్న డక్ట్ లో రియాన్ష్ రెడ్డి మృతదేహం కనిపించింది. తల ఛిద్రమై ఉంది. రియాన్ష్ రెడ్డి ఉండేది హెచ్ బ్లాక్. అక్కడ నుంచి జే బ్లాక్ కు వెళ్లిన రియాన్స్ రెడ్డి 35వ అంతస్తు నుంచి డక్ట్ లోకి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
కొడుకు కనిపించకపోవడంతో ముంబైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది స్వరూప. వెంటనే నగరానికి చేరుకున్నాడు సురేష్ కుమార్. ఈ కేసులో ప్రాథమిక విచారణలో చదువు విషయంలో వ్యక్తిగత ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రియాన్ష్ రెడ్డి స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లను విచారించిన తర్వాతనే మరిన్ని వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. దీని మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఏసిపి తెలిపారు.