తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్‌‌దళ్ ఆందోళన‌లు.. గాంధీ భవన్‌ వద్ద టెన్షన్ వాతావరణం..

By Sumanth Kanukula  |  First Published May 5, 2023, 12:40 PM IST

తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్‌‌దళ్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.


తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్‌‌దళ్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్ణాటక ఎన్నికల వేళ  భజరంగ్‌‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా  భజరంగ్‌‌దళ్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా  భజరంగ్‌‌దళ్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట ప్రజాస్వామ్యబద్దంగా హనుమాన్ చాలీసా పఠనం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు వారు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్దకు పెద్ద ఎత్తున భజరంగ్‌దళ్, బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. గాంధీ భవన్ ముందు బైఠాయించి హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు యత్నించారు. అయితే గాంధీ భవన్‌ వద్దకు చేరుకున్న భజరంగ్‌దళ్, బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.  ఈ క్రమంలోనే పోలీసులకు, భజరంగ్‌దళ్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై భజరంగ్ శ్రేణులు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  

Latest Videos

మరోవైపు బీజేపీ శ్రేణులు గాంధీ భవన్‌ వద్దకు చేరుకుంటూనే ఉన్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా గాంధీభవన్‌‌ వద్ద బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భజరంగ్‌దళ్ శ్రేణులు నిరసనకు దిగారు. సిరిసిల్ల జిల్లాలో నిరసనకు సిద్దమైన బీజేపీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిజమాబాద్ జిల్లాలో బీజేపీ కార్యాలయం నుంచి వద్ద ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

click me!