హైదరాబాద్ లో చికెన్ పకోడీ గొడవ... యువకుడిపై కత్తితో దాడిచేసిన నిర్వహకుడు

By Arun Kumar PFirst Published May 5, 2023, 10:05 AM IST
Highlights

మనుషుల ప్రాణాలకు లెక్కలేకుండా పోయింది. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా కేవలం చికెన్ పకోడీ కోసం జరిగిన గొడవలో ఒకరు కత్తిపోటుకు గురయిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : కేవలం చికెన్ పకోడీ రుచిగా లేదని... కారం ఎక్కువయ్యిందని అనడమే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. తాను చేసిన వంటకమే రుచిగా లేదనడంతో ఆ పకోడీ సెంటర్ నిర్వహకుడు ఆగ్రహంతో ఊగిపోతూ కస్టమర్ పై కత్తితో దాడిచేసాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో నాగార్జున నివాసముంటున్నాడు. అతడు గత బుధవారం రాత్రి కేపీహెచ్‌బీ ఫేజ్ 9 లోని జేఎస్ పకోడీ సెంటర్ లో తినడానికి వెళ్ళాడు. చికెన్ పకోడీ తీసుకోగా అది అంతగా రుచికరంగా అనిపించలేదు. దీంతో పకోడీలో కారం ఎక్కువైందని... అస్సలు తినలేకపోయానని నిర్వహకుడికి తెలిపాడు.  

అయితే నాగార్జున మాటలతో గిరాకీ దెబ్బతింటుందని భావించిన పకోడీ సెంటర్ నిర్వహకుడు జీవన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇష్టముంటే తిను లేదంటే నోరు మూసుకుని ఇక్కడినుండి వెళ్లిపోయవాలని నాగార్జునను హెచ్చరించాడు. దీంతో ఇద్దరిమధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. 

Read More  కబాబ్ రుచి నచ్చలేదని.. వంటవాడిని కాల్చిచంపిన దుండగులు..

ఇద్దరిమధ్య గొడవ జరుగుతున్న సమయంలోనే నాగార్జున సోదరుడు ప్రణీత్ అక్కడికి వచ్చాడు. పకోడీ సెంటర్ నిర్వహకుడు కోపంగా నాగార్జున మీదకు కత్తితో దూసుకువస్తుండటంతో ప్రణీత్ అడ్డుకునే ప్రయత్నం చేసాడు. దీంతో ఆ కత్తిపోటు కాస్తా ప్రణీత్ చేతిపై పడింది. చేయి మణికట్టు వద్ద తెగడంతో తీవ్ర రక్తస్రావం కాగా అతడిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇలా కేవలం చికెన్ పకోడీ రుచి విషయంలో జరిగిన గొడవ ఒకరిని హాస్పిటల్ పాలు చేసింది. రుచికరంగా వండాలనే తాను కారం ఎక్కువైందని చెప్పానని... దాన్ని పాజిటివ్ గా తీసుకోకుండా నిర్వహకుడు గొడవకు దిగినట్లు నాగార్జున తెలిపాడు. కస్టమర్ తో దారుణంగా వ్యవహరించిన పకోడీ సెంటర్ నిర్వహకుడు జీవన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 


 

click me!