
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య 21కి చేరింది. వివరాలు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకు కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డాక్యా నాయక్ బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ. 1.75 లక్షల గురించి ఆరా అధికారులు ఆరా తీశారు. ఆ మొత్తం కోస్గి భగవంత్ అనే వ్యక్తి నుంచి డాక్యా నాయక్ ఖాతాకు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కోస్గి భగవంత్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కోస్గి భగవంత్ తమ్ముడు కోస్గి రవికుమార్ కూడా ఏఈ పరీక్ష రాశాడు. ఈ క్రమంలోనే ఏఈ పేపర్ కొనుగోలు కోసం డాక్యా నాయక్‌కు భగవంత్ డబ్బులు లక్షలు చెల్లించినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో సిట్ అధికారులు కోస్గి భగవంత్, కోస్గి రవిలను అరెస్ట్ చేశారు.
‘‘తన సోదరుడు రవి కోసం భగవంత్.. 1.75 లక్షలు చెల్లించి డాక్యా నాయక్ నుంచి ప్రశ్నపత్రాన్ని పొందాడు’’ అని సిట్ అధికారులు తెలిపారు. ఇక, కోస్గి భగవంత్, కోస్గి రవిలను సిట్ అధికారులు గురువారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపర్చారు. దీంతో వారికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.