తెలుగు అకాడమీ స్కామ్: కోట్లు కొట్టేసి ఇన్నోవా కారులో నగదు తరలింపు, రూ. 6 కోట్లు కమిషన్

By telugu teamFirst Published Oct 2, 2021, 9:39 AM IST
Highlights

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాది కాలంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా ఉన్న మస్తాన్ వలీ మరో ముగ్గురిత ో కలిసి పక్కా ప్లాన్ వేసినట్లు తేలింది.

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పకడ్బందీ ప్రణాళికతో తెలుగు అకాడమీకి చెందిన 63.47 కోట్ల రూపాయలను యూనియన్ బ్యాంక్ నుంచి డ్రా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇతర ప్రాంతాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. ఇన్నోవా కారులో నగదును తరలించినట్లు పోలీసులు గుర్తించారు. 

అగ్రసేన్ బ్యాంక్ నుంచి నగదును ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకుకు తరలించినట్లు తెలుస్తోంది. పద్మావతి, మొహినుద్దీన్, రాజ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు నగదు డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

పరారీలో ఉన్న మరో ముగ్గురు దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గత ఏడాది నుంచి తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ సొమ్మును కాజేయడానికి యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన మస్తాన్ వలీ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఏపీ మర్కంటైన్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రాజుకు మస్తాన్ వలీ నగదు రూపంలో మార్చి, రవాణా చేయడానికి పది శాతం ఇచ్చినట్లు గుర్తించారు. అంటే, 6 కోట్లకు పైగా మస్తాన్ వలీ సత్యనారాయణ రాజుకు కమిషన్ చెల్లించాడు. 

తెలుగు అకాడమీ డబ్బులు కొల్లగొట్టడంలో నలుగురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తెలుగు అకాడమీ నుంచి కొట్టేసిన డబ్బులు నగదు రూపంలో ఎవరెవరికి వెళ్లాయనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 10 పోలీసు బృందాలు ఈ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగాయి. 

తమ బ్యాంక్ నుంచి డబ్బులు తరలిపోయినట్లు యూనియన్ బ్యాంక్ అధికారులు త్రిసభ్య కమిటీ ముందు అంగీకరించారు. మస్తాన్ వలీని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారించారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి అనంతపురం జిల్లాకు చెందినవాడని తెలుస్తోంది. అసలు పేరు కూడా వేరే ఉందని సమాచారం. 

తెలుగు అకాడమీ నగదును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపకం చేయాల్సి వచ్చిన తరుణంలో అసలు విషయం బయటపడింది. అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్లు మాయమైనట్లు గుర్తించారు. ఈ కుంభకోణం బయటపడిన నేపథ్యంలో తెలుగు అకాడమీ డైరెక్టర్ బాధ్యతల నుంచి సోమిరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం తప్పించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమె శుక్రవారం సాయంత్రమే బాధ్యతలు స్వీకరించారు. 

త్రిసభ్య కమిటీ శుక్రవారం రాత్రి తన విచారణను ముగించి నివేదికను రూపొందించినట్లు సమాచారం. ఈరోజు శనివారం కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి తరలించే అవకాశం ఉంది. త్రిసభ్య కమిటీ ఏసీవో రమేష్ ను, సోమిరెడ్డిని విచారించింది. పోలీసులు కూడా వారిద్దరినీ విచారించారు. 

click me!