తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన.. రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..

By team teluguFirst Published Nov 1, 2021, 5:30 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ (Shashank Goyal) సోమవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే వాటిని ఈ నెలాఖరు వరకూ స్వీకరించనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి  శశాంక్ గోయల్ (Shashank Goyal) సోమవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ.. పార్టీలకు చెందిన నేతలు హాజరయయారు. ఈ సందర్భంగా ఎస్‌ఈసీ శశాంక్ గోయల్.. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే వాటిని ఈ నెలాఖరు వరకూ స్వీకరించనున్నారు. ఈ ముసాయిదా ప్రకారం.. తెలంగాణలో (Telangana) 3,03,56,665 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది, థర్డ్ జెండర్ 1,683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై ఓటర్లు 2,742 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 5,01,836 మంది ఉన్నారు.

Also read: Huzurabad bypoll... ఆ వీవీప్యాట్‌తో ఎన్నికలకు సంబంధం లేదు: శశాంక్ గోయల్

సోమవారం నుంచి ఈనెల 30 వరకు ఓటర్ల అభ్యంతరాలను స్వీకరిస్తామని ఎస్‌ఈసీ తెలిపారు. 2022 జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటించిననున్నట్టు తెలిపారు. కాగా, ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను డిసెంబరు 6 వరకూ స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

Also read: huzurabad bypoll: వీవీ ప్యాట్‌ల తారుమారుపై దుమారం .. వివరణ కోరిన తెలంగాణ సీఈవో

హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. శశాంక్ గోయల్
ఇదిలా ఉంటే  హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్‌లో కౌంటింగ్ జరుగుతుందని..  22 రౌండ్స్ లో కౌంటింగ్‌ జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు లెక్కించనున్నట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనల పాటిస్తూ కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు.  ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ ఆవరణలో మీడియో సెంటర్‌ను ఏర్పాటు చేశామని  వెల్లడించారు.  విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

click me!