25వేల మంది అన్నదాతలతో భారీ ఆత్మీయ సమ్మేళనం: మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 1, 2021, 5:30 PM IST
Highlights

దాదాపు 25వేల మంది అన్నదాతలతో భారీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 

వనపర్తి: త్వరలో 25 వేల మందితో వనపర్తిలో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనం భారీగా నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, అనుబంధ రంగాల నిపుణులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలో ఇంకా చర్చ జరగాలని... అందుకోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసినట్లు వ్యవసాయ మంత్రి తెలిపారు. 

''రైతు బతికితేనే రాజ్యం బతుకుతుంది. రైతు పరిస్థితి 2014 తెలంగాణకు ముందు, 2014 తెలంగాణ తర్వాత బేరీజు వేసుకోవాలి. రైతు రాజ్యంగా, రైతు రాష్ట్రంగా తెలంగాణ నిలవాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి KCR పనిచేస్తున్నారు. వ్యవసాయానికి, వ్యవసాయదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, పథకాలు దేశంలో ఎక్కడా, ఎవరూ ఇవ్వడం లేదు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, రైతుబంధు కింద పంట పెట్టుబడి, రైతు భీమా పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుకావడం లేదు'' అని వ్యవసాయ మంత్రి singireddy niranjan reddy పేర్కొన్నారు. 

''సాంప్రదాయ పంటల సాగు నుండి రైతులు బయటకు రావాలి. ఏ రకమైన పంటలు పండిస్తే మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందో వాటినే పండించాలి. నిరంతరం పంటల సాగు, సాగు పద్దతుల అంశాల మీద రైతువేదికలలో చర్చ జరగాలి'' అని సూచించారు. 

వీడియో

''ఆహార ధాన్యాల పంటలతో పాటు ఉద్యాన పంటల మీద ఇకపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పండ్ల తోటలు, ఆయిల్ పామ్, నూనె గింజల సాగు మీద దృష్టిపెట్టాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. రైతులు ఆర్థికంగా స్థిరత్వం సాధించి బలపడితే ఆయన చుట్టూ ఉన్న సర్వ వ్యవస్థలు బలపడతాయి'' అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

read more  

''డిజిటల్ స్క్రీన్లతో రైతులకు రైతు వేదికల ద్వారా వ్యవసాయ సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అధునాతన సాంకేతికత ద్వారా రైతులకు జ్ఞానం, విజ్ఞానం అందించేందుకు కృషి చేస్తాం. మార్కెటింగ్ నెట్ వర్క్ ను వ్యవసాయరంగానికి అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటాం. రైతు వేదికలలో రైతు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వచ్చిన సూచనలు, సలహాలు తీసుకుని ముందుకుసాగుతాం'' అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఇదిలావుంటే గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 18న ప్రగతిభవన్ లో ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.  గత సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం సివిల్ సప్లై శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం సీఎం  కేసీఆర్ హామీ ఇచ్చారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సిఎం  కేసీఆర్  సూచించారు.  మధ్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

అయితే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో దుమారం చెలరేగింది. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తనాలు సరఫరా చేసే డీలర్ల సమావేశంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ కలెక్టర్ వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ దుమారం రేగింది. 

click me!