Huzurabad bypoll... ఆ వీవీప్యాట్‌తో ఎన్నికలకు సంబంధం లేదు: శశాంక్ గోయల్

By narsimha lode  |  First Published Nov 1, 2021, 4:53 PM IST

వీవీప్యాట్ తరలింపు వీడియో వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పందించారు. ఈ వీవీప్యాట్ కు ఎన్నికలతో సంబంధం  లేదని ఆయన స్పష్టం చేశారు.


కరీంనగర్: Huzurabad bypollల్లో వీవీప్యాట్ విషయమై చెలరేగిన దుమారంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి shashank goyal వివరణ ఇచ్చారు. ఆ vvpatకి ఎన్నికలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

వీవీ ప్యాట్ ను ఒక వాహనం నుండి మరో వాహనంలోకి మారుస్తున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో విషయమై బీజేపీ నేతలు కూడ స్పందించారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.ఈ విషయమై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ , హుజూరాబాద్ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు.

Latest Videos

undefined

also read:huzurabad bypoll: వీవీ ప్యాట్‌ల తారుమారుపై దుమారం .. వివరణ కోరిన తెలంగాణ సీఈవో

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 200 నెంబర్ పోలింగ్ కేంద్రంలో పనిచేయని వీవీప్యాట్  స్థానంలో మరో వీవీ ప్యాట్ ను మార్చారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఒక ప్రభుత్వ వాహనం నుండి మరో ప్రభుత్వ వాహనంలోకి ఈ వీవీప్యాట్ ను మార్చే సమయంలో  గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తొలుత ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు బయటపెట్టారు. పోలింగ్ మెటిరీయల్ ను తీసుకెళ్లే బస్సులో కాకుండా ప్రైవేట్ వాహనంలో వీవీ ప్యాట్ ను తీసుకెళ్లారని కాంగ్రెస్ ఆరోపించింది. అధికారాన్ని ఉపయోగించుకొని టీఆర్ఎస్ వీవీప్యాట్లను మార్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ వాహనంలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ మనుషులు వీవీప్యాట్లను మార్చారని కాంగ్రెస్ ఆరోపించింది.

ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి ఇవాళ వివరణ ఇచ్చారు. పనిచేయని వీవీప్యాట్ ను ఒక వాహనం నుండి మరో వాహనంలోకి మార్చామని ఆయన శశాంక్ గోయల్ కు వివరించారు. పోలింగ్ కు ముందే ఈ వీవీప్యాట్ ను పక్కన పెట్టామని ఆయన చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ రిసెప్షన్ సెంటర్ కు ఎదురుగా ఉన్న రోడ్డుపై ఒక వాహనం నుండి మరో వాహనంలోకి మార్చినట్టుగా ఆయన శశాంక్ గోయల్ కు నివేదిక ఇచ్చారు.

వీవీప్యాట్ ను ప్రైవేట్ వాహనాల్లో తరలించలేదని రిటర్నింగ్ అధికారి తేల్చి చెప్పారు. ఎన్నికల కోసం ఉపయోగించిన ఒక వాహనం నుండి మరో వాహనంలోకి వీవీప్యాట్ ను మార్చినట్టుగా ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాలను ఉపయోగించలేదన్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. 22 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం  అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.మరో వైపు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని శశాంక్ గోయల్ తెలిపారు.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ లు బరిలో నిలిచారు. వీరి భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది.


 

click me!