ఛలో రాజ్‌భవన్‌కు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ పిలుపు

By Mahesh RajamoniFirst Published Nov 7, 2022, 2:52 PM IST
Highlights

Hyderabad: ఛ‌లో రాజ్‌భవన్‌కు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు గవర్నర్‌ను ఉపయోగించుకోవద్దని విద్యార్థి సంఘం కేంద్రాన్ని హెచ్చరించింది.
 

Chalo Raj Bhavan: తెలంగాణ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తీసుకోవడంలో జాప్యంపై ఆగ్రహించిన తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఛ‌లో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. మంగళవారంలోగా తెలంగాణ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుకు ఆమోదం తెలపకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని జేఏసీ హెచ్చరించిందని సియాస‌త్ నివేదించింది.  తమ రాజకీయ ఎజెండాను నెరవేర్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు బిల్లు ఆమోదంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని జేఏసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘం ఇటీవల ఓ సమావేశంలో ఆరోపించింది. 

తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు గవర్నర్‌ను ఉపయోగించుకోవద్దని విద్యార్థి సంఘం కేంద్రాన్ని హెచ్చరించింది. “బిల్లును ఆమోదించడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదని తెలిసినప్పటికీ, గవర్నర్ ఉద్దేశపూర్వకంగా బిల్లు ఆమోదంలో జాప్యం చేస్తున్నారు. విధానపరమైన అంశాల్లోకి రాజకీయాలను అనవసరంగా తీసుకువస్తున్నారు’’ అని జేఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించకపోతే, అన్ని జాతీయ విశ్వవిద్యాలయాల నుండి వేలాది మంది విద్యార్థులు “ఛ‌లో రాజ్ భవన్”కు హాజరవుతారని జేఏసీ హెచ్చ‌రించింది. ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రించడానికి గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ కేంద్ర ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
 

click me!