
తెలంగాణ నిరుద్యోగులు నిరసన కార్యక్రమాల్లో కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. తమ కడుపులో ఉన్న బాధను వ్యక్తం చేసేందుకు వినూత్న విధానాలు ఫాలో అవుతున్నారు. తాజాగా ఉస్మానియాలో ఎస్సై అభ్యర్థులు ఫలితాలు విడుదల చేయాలని నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో బింగీలు (గుంజిళ్లు) తీసి నిరసన తెలిపారు. 9నెలలు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ రిక్ర్యూట్ మెంట్ బోర్డ్ ఎస్సై ఫలితాలు విడుదల చేయలేదని ఆరోపించారు. ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు శుక్రవారం ఉదయం నిరుద్యోగ జెఏసి బింగీలు తీసి వినూత్న నిరసన చేపట్టింది.
ఈ సందర్భంగా నిరుద్యోగ జెఏసి చైర్మన్ కోటూరి మానవతా రాయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన విధంగా ఎస్సై పరీక్షలో ఇంగ్లీష్ మెరిట్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫలితాలను వారం రోజుల్లో విడుదల చేయకపోతే డిజిపి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఫిబ్రవరి 6వ తేదీ, 2016 న ఎస్ఐ నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 16,2017 ప్రిలిమ్స్, నవంబరు 19,20 తేదీల్లో మెయిన్స్ జరిపి 18 నెలలు గడుస్తున్నా ఫలితాలు రాకపోవడం తెలంగాణ సర్కారు అసమర్థతకు నిదర్శనమన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రలో మన కన్నా 7 నెలలు నోటిఫికేషన్ ఆలస్యంగా సెప్టెంబరు17,2016ఇచ్చి, అన్ని ఫలితాలు విడుదల చేసి,అభ్యర్దులను జులై మొదటి వారంలో శిక్షణకు పంపటం జరిగిందన్నారు. ఫలితాల విడుదల జాప్యం చేసి తెలంగాణ బిడ్డల జీవితాలతో ఆడుకోవద్దని మానవతా రాయ్ హెచ్చరించారు. ఈ నిరసనలో ఓయూ ఎన్.ఎస్.యు.ఐ నాయకులు మస్కాపురం నరేష్,నిరుద్యోగ జెఏసి నాయకులు బూసిపల్లి లచ్చిరెడ్డి,మధు, శ్రీకాంత్,రమేష్,జగన్నాధ్ తదితరులు పాల్గొన్నారు.