
బంజారాహిల్స్ లో శుక్రవారం తెల్లవారుజామున విక్రం గౌడ్ పై కాల్పుల ఘటన మిస్టరీగా మారింది. తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు విక్రం గౌడ్ భార్య చెబుతున్నారు. ఈ సంఘటపై పోలీసు వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. విక్రం గౌడ్ పై హత్యాయత్నం చేశారా? లేక ఆత్మహత్యాప్రయత్నం చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. విక్రం గౌడ్ గత కొంత కాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు తెలిసింది. దీంతా ఆయన ఆందోళనగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యాప్రయత్నానికి పాల్పడి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ వాచ్ మెన్ డ్యూటీలో ఉన్న షరీఫుద్దీన్ పోలీసులకు కీలకమైన విషయాలు వెల్లడించారు. అసలు కాల్పులు జరిగిన సమయంలో అక్కడికి ఎవరూ రాలేదని, బయటివాళ్ల కదలికలు ఏమాత్రం లేవని షరీఫుద్దీన్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సిటీ సిపి మహేందర్ రెడ్డి కూడా ధృవీకరించారు.
విక్రం గౌడ్ వద్ద లైసెన్స్ కలిగిన ఆయుధం కూడా లేదని కమిషనర్ అంటున్నారు. ఇప్పటికే విక్రం గౌడ్ కేసులో 10 టీమ్స్ ఏర్పాటు చేశామని సిపి చెప్పారు. సిసి పుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామన్నారు. రక్తపు మరకలను పొరపాటున వాచ్ మెన్ తుడిచి వేశాడని సిపి అన్నారు. సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నాం. మరి కాసేపట్లో ఎవరు కాల్పులు జరిపింది ఓ క్లారిటీ వస్తుందన్నారు. క్లూస్ టీం కొన్ని ఆధారాలు సేకరించిందన్నారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.
విక్రం గౌడ్ భార్య షిమాలి వాదన మరోలా ఉంది. ఉదయం తెల్లవారుజామున రెడీ అయి దర్గా వద్ద అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వెళ్తామనుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నరు. దర్గాలో అన్నదానం కార్యక్రమం కోసం పొద్దున 2 గంటలకు లేచాం... 3 గంటల కు కింది అంతస్తులో కాల్సుల శబ్దం వినబడింది అని ఆమె పేర్కొన్నారు. అయితే విక్రం గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం నాటికి విక్రం గౌడ్ పై హత్యాయత్నం జరిగిందా? లేక ఆత్మహత్యా ప్రయత్నం చేశారా అన్నది తేలే అవకాశం ఉంది.