టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజి కేసు... బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ కూడా అరెస్ట్

By Arun Kumar P  |  First Published Apr 5, 2023, 10:01 AM IST

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కోసం గాజుల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. 


హైదరాబాద్ :పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ లో సంజయ్ నివాసానికి అర్థరాత్రి వెళ్లిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. బిజెపి శ్రేణుల ఆందోళనల మధ్య సంజయ్ ను పోలీస్ వాహనంలో కరీంనగర్ నుండి హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలో సంజయ్ అరెస్ట్ గురించి తెలుసుకునేందుకు వెళ్లిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. 

మప్టీలో వున్న పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో రఘునందన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. చొక్కా పట్టుకుని లాగుతూ పోలీస్ వాహనంలో ఎక్కిస్తూ అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులతో రఘునందన్ వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని... ఓ ఎమ్మెల్యేను పట్టుకుని మెడ పట్టుకుని లాగి దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ రఘునందన్ పోలీసులపై మండిపడ్డారు.

Latest Videos

బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతోనే రఘునందన్ ను ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ చేసే ప్రొసీజర్ ఇదేనా? అని రఘునందన్ ప్రశ్నించారు. సంజయ్ అరెస్ట్ గురించి తెలుసుకునేందుకు డీసీపీని కలిసేందుకు వస్తే అరెస్ట్  చేస్తారా? అని దుబ్బాక ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Read More  బండి సంజయ్ ఆరెస్ట్‌: జేపీ నడ్డా ఆరా , మాజీ ఎమ్మెల్సీకి ఫోన్

ఎలాంటి ఉద్రిక్తత జరక్కుండా పోలీసులకు సహకరిస్తానని చెప్పానని... అయినా వినకుండా పోలీసులు దౌర్జన్యంగా పోలీస్ వాహనంలో ఎక్కిస్తున్నారని రఘునందన్ అన్నారు. తన రక్షణ కోసం తుపాకీ దగ్గర పెట్టుకున్నానని... పోలీసులకు ఈ విషయం చెప్పినా వినిపించుకోవడం లేదని అన్నారు.  పోలీసుల చేష్టలతో గన్ మిస్ ఫైర్ అయ్యే ప్రమాదం వుందని రఘునందన్ ఆందోళన వ్యక్తం చేసారు. 

 మహిళా మోర్చా నాయకులతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు... మహిళలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తారా? అంటూ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కేసీఆర్, పోలీసులకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తుండటంతో సంజయ్ ను వుంచిన గాజులరామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేసిన రఘునందన్ రావును శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అలాగే మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష సహా పలువురు నేతలు, కార్యకర్తలను గాజుల రామారం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అరెస్ట్ చేసిన వారిని వివిధ స్టేషన్లకు తరలిస్తున్నారు. 

ఇక బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా భారీగా బిజెపి శ్రేణులు గాజుల రామారం చేరుకునే అవకాశాలున్నాయని అనుమానిస్తూ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.బొమ్మల రామారాం వైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికెడ్లు పెట్టి అష్ట దిగ్బంధనం చేసారు. నలువైపులా పోలీసులను భారీగా మోహరించి ఆర్టీసీ బస్సులు సహా ఏ ఒక్క వాహనాన్ని బొమ్మల రామారం వెళ్లనీయకుండా ఆపేస్తున్నారు. చివరకు గ్రామస్తుల వాహనాలను సైతం అడ్డుకుంటున్నారు. 
 


 

click me!