
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకుని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీసు ష్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నాయకులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బొమ్మలరామారం పోలీసు ష్టేషన్‌కు చేరుకుంటున్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
అయితే ఈ క్రమంలోనే కొందరు బీజేపీ శ్రేణులు పోలీసు స్టేషన్‌లోని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్ని అక్కడి నుంచి వాహనాల్లో తరలిస్తున్నారు.
మరో వైపు బండి సంజయ్‌ను పరామర్శించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బొమ్మలరామారం పోలీసు ష్టేషన్‌కు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ అరెస్ట్‌కు గల కారణాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, రఘునందన్ రావుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక, కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను.. తనను తీసుకెళ్లడానికి గల కారణమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తన మీద ఏం కేసు ఉందని?, వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అయితే పోలీసులు కారణం చెప్పకుండానే బండి సంజయ్‌ను ఆయన ఇంటి నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో బీజేపీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అయితే ఈ ఉద్రిక్తతల మధ్యే బండి సంజయ్‌ను పోలీసు వాహనంలోకి ఎక్కించిన పోలీసులు.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారనే దానిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
పోలీసలు తనను అరెస్ట్ చేయడం బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘బీఆర్‌ఎస్‌లో భయం నిజమే.! ముందుగా నన్ను ప్రెస్ మీట్ నిర్వహించకుండా ఆపి.. ఇప్పుడు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, దాని తప్పుడు పనులను ప్రశ్నించడమే నా తప్పు. నన్ను జైల్లో పెట్టినా బీఆర్‌ఎస్‌ని ప్రశ్నించడం ఆపవద్దు. జై శ్రీరామ్’’ అని పేర్కొన్నారు.
బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని.. ఆయనను కరీంనగర్‌లోని ఆయన నివాసం నుంచి అక్రమంగా నిర్బంధించారని అన్నారు. ఈ చర్యలు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి భంగం కలిగించడానికి తప్ప మరొకటి కాదని విమర్శించారు. అర్దరాత్రి ఎంపీని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీక్ కేసులో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడంతోనే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఇక, బండి సంజయ్‌ను అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలంగాణ బీజేపీ నేతలు తెలిపారు.