
తెలంగాణ సచివాలయ తరలింపు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. పెరేడ్ గ్రౌండ్ లో సచివాలయం నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.
ప్రస్తుతం సెక్రటేరియట్ ఉన్న చోట భయంకరమైన వాస్తు దోషం ఉందని వెంటనే దాన్ని వేరే చోటకు తరలించాలని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే భావించారు.
అందుకు తగ్గట్టుగా మొదట ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి స్థలంలో సచివాలయం భారీ స్థాయిలో నిర్మించాలని భావించారు.
అయితే అక్కడున్న సిబ్బంది, ప్రజాసంఘాలు వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఆ తర్వాత సికింద్రాబాద్ సమీపంలో ఉన్న పెరేడ్ గ్రౌండ్ లో కొత్త హంగులతో సచివాలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి కూడా లేఖ రాశారు. పెరేడ్ గ్రౌండ్ స్థలం తమకు కేటాయించాలని కోరారు.
రెండేళ్లు గడిచినా వారి నుంచి స్పందన లేదు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఈ విషయంపై ప్రధానితో చర్చించారు. అలాగే, గవర్నర్ నరసింహన్ ఈ విషయంపై పలుసార్లు ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు.
దీంతో ఈ విషయంలో కేంద్రం కొంచెం కదిలింది. రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది.
దీనికి సంబంధించి రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ రక్షణ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి ఓకే చెప్పారు.
అయితే పెరేడ్ గ్రౌండ్ స్థలానికి బదులుగా సిటీ శివార్లలలో 150 ఎకరాల స్థలాన్ని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు కేటాయించాలని షరతు విధించారు.
దీనికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించనట్లు తెలిసిందే.
పెరేడ్ గ్రౌండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ కేంద్రానికి కృతజ్జతలు తెలిపారు.