రేవంత్ సర్కార్ టార్గెట్ బిఆర్ఎస్ ... మాజీ ఎమ్మెల్యే మాల్ సీజ్ కు బహిరంగ ప్రకటన

By Arun Kumar P  |  First Published Dec 8, 2023, 7:14 AM IST

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత ఆశన్నగారి జీవన్ రెడ్డి కుటుంబానికి చెందిన షాపింగ్ మాల్ సీజ్ చేస్తామని తెలంగాణ ఆర్టిసి అధికారులు హెచ్చరించారు. కేవలం నోటీసులు జారీ చేయడమే కాదు బహిరంగంగానే మైక్ ద్వారా హెచ్చరించారు. 


నిజామాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకుని అధికారాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే పాలనపైనే కాదు గత ప్రభుత్వంలో జరిగిన పనులపైనా దృష్టిపెట్టారు. అలాగే బిఆర్ఎస్ నాయకుల చేతిలో వున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నాలు ప్రారంభించారు.  ఇందులో భాగంగానే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డికి ఆర్టిసి అధికారులు షాకిచ్చారు. తెలంగాణ ఆర్టిసి స్థలంలో మాజీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న భారీ మాల్ ను సీజ్ చేస్తామంటూ అధికారులు నోటీసులు జారీ చేసారు.

వివరాల్లోకి వెళితే... ఆర్మూర్ ఆర్టిసి బస్టాండ్ ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భారీ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు.  ఆయన సతీమణి రజిత రెడ్డి 'విష్ణుజిత్ ఇన్ఫ్రా లిమిటెడ్' సంస్థ ద్వారా ఆర్టిసి స్థలాన్ని లీజుకు తీసుకుని 'జీవన్ మాల్' నిర్మించారు. ఇందులో అనేక వ్యాపారాలు కొనసాగుతున్నాయి.

Latest Videos

అయితే 'జీవన్ మాల్' యాజమాన్యం ఆర్టిసితో చేసుకున్న ఒప్పందం ప్రకారం లీజు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో దాదాపు రూ.8 కోట్ల వరకు బకాయి పడింది. ఈ బకాయి వెంటనే చెల్లించాలంటూ ఆర్టిసి అధికారులు నోటీసులు జారీ చేసారు. ఆర్టిసి ఉన్నతాధికారులు జీవన్ మాల్ ను పరిశీలించి లీజు బకాయిలు చెల్లించాలంటూ బహిరంగంగానే మైకు ద్వారా ప్రకటించారు. బకాయి డబ్బులు చెల్లించని పక్షంలో ఏ క్షణానయినా జీవన్ మాల్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కాబట్టి ఈ మాల్ లో వ్యాపారాలు కొనసాగిస్తున్నవారు ఖాళీ చేయాలని హెచ్చరించారు.  

Also Read  CM Revanth Reddy: ప్రజాస్వామ్యం పునరుద్ధరణ.. ప్రతి శుక్రవారం ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్

కేవలం ఆర్టిసికి మాత్రమే కాదు విద్యుత్ శాఖకు కూడా ఈ 'జీవన్ మాల్' యాజమాన్యం కోట్లల్లో కరెంట్ బిల్లు బకాయి వుంది. దాదాపు రూ.2 కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు కట్టాల్సి వుంది. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే జీవన్ మాల్ కు కరెంట్ సరఫరా నిలిపివేసారు. ఇప్పుడు ఆర్టిసి అధికారులు ఏకంగా వారంరోజుల్లో మాల్ ను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

ఆర్టిసి స్థలంలో 'జీవన్ మాల్' ఏర్పాటుపై ముందునుండి తీవ్ర వివాదం సాగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టిసి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షంలో వుండగా కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఆదీనంలో వున్న ఆర్టిసి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసమే ఆర్టిసి అధికారులు రంగంలోకి దిగారు. 
 

click me!