తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా పది ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, సీఎం రేవంత్ తొలి సంతకం ఆరు గ్యారంటీలపై పెట్టారు. నేడు ఉదయం విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి శుక్రవారం ప్రజా భవన్‌లో ప్రగతి భవన్ ఉంటుందని తెలిపారు.
Top Stories: ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పది మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు భట్టి విక్రమార్క్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ సహా మంత్రులు సచివాలయానికి వెళ్లి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో రూ. 85 వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు చెప్పడంతో ఈ విషయాలు దాచడంపై సీఎం ఆగ్రహించారు. ఈ రోజు ఉదయం విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎండీ ప్రభాకర్ రాజీనామాను ఆమోదించరాదని, ఆయననూ ఈ భేటీకి రమ్మనాలని కోరారు.
మంత్రుల జాబితాః
కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంతో కలిపి మొత్తం 18 మంది మంత్రులుగా ఉండొచ్చు. ఇప్పటి వరకు 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయగా.. మరో ఆరుగురికి అవకాశం ఉన్నది. సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా భట్టి ప్రమాణం చేశారు. మంత్రుల పేర్లు ఇవీ
1. నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,
2. దామోదర రాజనర్సింహ,
3. దుద్దిళ్ల శ్రీధర్ బాబు,
4. పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
5. పొన్నం ప్రభాకర్,
6. కొండా సురేఖ,
7. సీతక్క,
8. తుమ్మల నాగేశ్వరావు,
9. జూపల్లి కృష్ణారావు,
10. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read: CM Revanth Reddy: కాంగ్రెస్ కరెంట్ కష్టాలు? నేడు ఉదయం ఉన్నతాధిరులతో సీఎం భేటీ
మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ః
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత అదే వేదికపై ఎన్నికల క్యాంపెయిన్‌లో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు సంతకం చేశారు. ఈ హామీల అమలుకు సంబంధించిన అభయ హస్తం చట్టం డ్రాఫ్టుపై ఆయన సంతకం చేశారు. రెండో సంతకం రజినీకి ఉద్యోగం కోసం పెట్టారు.
సీఎంవో ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిః
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గురువారం తొలి ఐఏఎస్ నియామకం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియామకం జరిగింది. శేషాద్రికి రెవెన్యూ, భూ వ్యవహారాల్లో మంచి అవగాహన ఉన్నది. ధరణి పోర్టల్‌లో ఆయనది కీలక పాత్ర. కేంద్ర సర్వీసుల నుంచి కేసీఆర్ ఆయనను రాష్ట్రానికి రప్పించుకోగా.. రేవంత్ ఆయనను సీఎంవో ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. అలాగే.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అదనపు డీజీ శివధర్ రెడ్డిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Hyderabad: ఒక రౌడీ షీటర్.. రూ. 100 కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టాడు? ఈడీ దర్యాప్తు
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ షాక్ః
ఆర్మూర్ బస్టాండ్‌కు ఆనుకుని ఉన్న 7 వేల చదరపు గజాల స్థలాన్ని 2013లో 33 ఏళ్ల లీజుకు విష్ణుజిత్ ఇన్‌ఫ్రా అనే సంస్థ తీసుకుంది. ఆ తర్వాత అక్కడే జీ1 పేరిట భవనం కట్టి దుకాణాలు, సినిమా హాళ్లు ఏర్పాటు చేశారు. అయితే.. అద్దె బకాయిలు మాత్రం వారు కట్టలేదు. అద్దె రూ. 7.23 కోట్లకు చేరడంతో లీజు తీసుకున్న సంస్థకు ఆర్టీసీ నోటీసులు ఇచ్చింది. కానీ, అద్దె చెల్లించకపోవడంతో ఆ మాల్ ముందుకు వెళ్లి హెచ్చరించారు. అయినా.. స్పందన లేకపోవడంతో ఆ మాల్‌కు కరెంట్ సరఫరాను నిలిపేశారు.
సమ్మక్క, సారలమ్మ కేంద్రీయ వర్సిటీకీ లోక్‌సభ ఆమోదంః
నిన్న పార్లమెంటులో సమ్మక్క, సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు గురువారం లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ వర్సిటీ ఏర్పాటు కోసం రూ. 900 కోట్ల నిధులు కేటాయించినట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.
ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్:
ప్రగతి భవన్ ఇకపై మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా దర్బార్ అని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను తొలగించారు. ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరు కానున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నారు.