తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు:కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సెక్రటేరియట్ ప్రారంభం

By narsimha lode  |  First Published Jan 15, 2023, 1:03 PM IST

వచ్చే నెల  17న  తెలంగాణ సచివాలయం ప్రారంభం కానుంది.  కేసీఆర్ పుట్టిన రోజున  కొత్త సచివాలయం  ప్రారంభించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 


హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి  17న తెలంగాణ సచివాలయం  ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  సచివాలయ నిర్మాణ పనులు  దాదాపుగా  పూర్తి కావచ్చాయి.మిగిలిన పనులను త్వరగా  పూర్తి చేసి వచ్చే నెల  17న ప్రారంభించనుంది ప్రభుత్వం.తెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చివేసి  కొత్త భవనాన్నినిర్మించాలని  కేసీఆర్  సర్కార్ నిర్ణయం తీసుకుంది.  ఈ  మేరకు  2019 జూన్  27న  కొత్త సచివాలయ నిర్మాణ పనులకు  కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆరు లక్షల  చదరపు  అడుగుల స్థలంలో  కొత్త సచివాలయాన్ని  నిర్మించాలని  కేసీఆర్ సర్కార్  నిర్ణయం తీసుకుంది.  

తొమ్మిది మాసాల్లో ఈ సచివాలయాన్ని నిర్మించాలని  భావించారు. కానీ  కరోనా కారణంగా  సెక్రటేరియట్ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. సచివాలయ భవనాన్ని  కూల్చివేయడంపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు  చేశారు. అయితే  ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు  కొత్త సచివాలయ నిర్మాణానికి 2020 జూన్  29వ తేదీన  గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. కొత్త సెక్రటేరియట్  నిర్మాణ పనులను  పలు దఫాలు సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇటీవల కాలంలో  సెక్రటేరియట్ నిర్మాణ పనులను  కేసీఆర్ చూశారు. పలు సూచనలు  చేశారు.  సీఎం కేసీఆర్ సూచనల మేరకు  నిర్మాణ పనులు  చివరి దశలో  ఉన్నాయి. 

Latest Videos

దసరా నాటికే  తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ  అప్పటికీ  పనులు పూర్తి కాలేదు.  దీంతో  ఫిబ్రవరి  17న  కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.  ఏడు అంతస్థులతో  ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి సుమారు  రూ. 650 కోట్లు  ఖర్చు పెట్టారు. 

కొత్త సచివాలయం  పార్కింగ్  స్థలంలో  300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్  చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో  ఫోటో గ్యాలరీ,  మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ , రెండు, మూడో అంతస్థుల్లో  కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు  ఉంటాయి.  ఏడో అంతస్థులో  సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది. సీఎంఓలో  30 కంపార్ట్ మెంట్లుంటాయి.  ముందు వైపు నీలం రంగులో  అద్దాలుంటాయి.  రాజస్థాన్  నుండి ధోల్పూరు లేత గోధుమ రంగు  ఇసుకరాయిని  ఈ సచివాలయ నిర్మాణానికి  ఉపయోగించారు. 
సచివాలయం  మధ్య భాగంలో  ఆలయం మాదిరిగానే ఐదు గోపురాలుంటాయి.  తెలంగాణ  సచివాలయం  ఏళ్ల తరబడి  నిలిచి ఉండేలా  నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు  100 ఏళ్ల పాటు  ఈ నిర్మాణం ఉండేలా  నిర్మించినట్టుగా  ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రతి అంతస్తు 14 ఫీట్ల ఎత్తులో  ఉంటుంది.  సచివాలయంలో  అత్యంత  అత్యాధునిక  టెక్నాలజీతో  భధ్రతను ఏర్పాటు  చేశారు

click me!