మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంపై తెలంగాణ గవర్నర్ స్పందించారు.ఈ ఘటనపై గైనకాలజిస్టుగా తనకు అనేక ప్రశ్నలున్యాన్నారు.
హైదరాబాద్: మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంపై తనకు అనేక ప్రశ్నలున్నాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు.ఆదివారంనాడు రాజ్ భవన్ లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మలక్ పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. బాలింతల మరణాలపై ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని గవర్నర్ చెప్పారు. ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నానన్నారు. కానీ పండుగ కావడంతో వెళ్లలేకపోయినట్టుగా గవర్నర్ చెప్పారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
వైద్యరంగంలో వసతులు మెరుగవ్వడం లేదని చెప్పడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాల్సిన అవసరాన్ని గవర్నర్ నొక్కి చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. ప్రభుత్వ బిల్లులు పెండింగ్ లో లేవన్నారు. తన, పరిశీలనలో ఉన్నాయని ఆమె తెలిపారు.
ALSO READ:మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి: రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
వర్సిటీ నియామకాల బిల్లులో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటి నియామకాల బిల్లు వివాదాలతో ఆలస్యం కారాదన్నదే తన అభిమతమని గవర్నర్ వివరించారు. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా గవర్నర్ గుర్తు చేశారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని గవర్నర్ కోరారు. ఇవాళ ప్రధాని మోడీ వందే భారత్ రైలు ప్రారంభిస్తున్నారన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ గా రైల్వే ల అభివృద్ది జరుగుతోందని గవర్నర్ చెప్పారు.అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వేను ఆధునికరిస్తున్నట్టుగా గవర్నర్ తెలిపారు. ప్రజలంతా టీవీలు చూస్తున్న సమయంలో రేడీయోలో మన్ కి బాత్ ద్వారా రేడియోకి మోడీ పునర్వైభవం తెచ్చారన్నారు.