మేడిగడ్డ బ్యారేజీ: కుంగిన పిల్లర్లను పరిశీలించిన సీఎం రేవంత్ సహా ఎమ్మెల్యేల బృందం

By narsimha lodeFirst Published Feb 13, 2024, 4:01 PM IST
Highlights

మేడిగడ్డ బ్యారేజీని  తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ప్రజా ప్రతినిధులు  పరిశీలించారు.


కరీంనగర్: మేడిగడ్డ బ్యారేజీకి చెందిన కుంగిన పిల్లర్లను తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డితోపాటు  మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  మంగళవారం నాడు పరిశీలించారు. ఇవాళ  ఉదయం అసెంబ్లీ నుండి  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం  మేడిగడ్డకు మూడు బస్సుల్లో బయలుదేరారు.  ఈ టూర్ కు  బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.

తొలుత  ఈ బ్యారేజీపై నుండి  ఎమ్మెల్యేలు కుంగిన పిల్లర్లను పరిశీలించారు.  ఆ తర్వాత  బ్రిడ్జి దిగువ భాగంలో  కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో  అధికారులు సీఎం బృందానికి వివరించారు.  ఈ సందర్భంగా అధికారులను సీఎం సహా ఎమ్మెల్యేలు సమాచారం అడిగి తెలుసుకున్నారు.  ఈ పిల్లర్ల కుంగుబాటును  సీపీఐ,ఎంఐఎం ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.మేడిగడ్డ బ్యారేజీకి చెందిన  21వ పిల్లర్ వద్ద  పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. 

also read:మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: బీజేపీ, బీఆర్ఎస్ దూరం

మేడిగడ్డ బ్యారేజీ కాళేళ్వరం ప్రాజెక్టులో  కీలకమైంది.  మేడిగడ్డ బ్యారేజీ నుండే  గోదావరి వరద నీటిని లిఫ్ట్ చేస్తుంటారు.  అయితే  ఈ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో  నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది.  ఈ విషయమై  ఎమ్మెల్యేల బృందానికి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనుంది. ఆ తర్వాత  ఈ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే  అవకాశం ఉంది.

గత ఏడాది అక్టోబర్ మాసంలో  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైంది. ఈ విషయమై అప్పటి ప్రభుత్వం  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన  మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు గురికావడంపై బీఆర్ఎస్ పై  కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.  ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.  విజిలెన్స్  ప్రభుత్వానికి  మధ్యంతర నివేదికను ఇచ్చింది.ఈ నివేదిక గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు  వివరించనున్నారు. 

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను  కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ  నల్గొండలో  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో  ఇవాళ భారీ సభను ఏర్పాటు చేశారు. తాము నల్గొండలో సభ ఏర్పాటు చేయడంతో  మేడిగడ్డకు  ఎమ్మెల్యేలను ప్రభుత్వం తీసుకెళ్లిందని  బీఆర్ఎస్ విమర్శలు చేసింది. 
 

click me!