వరి మడిలో వింత ప్రమాదం... బోరుబావిలో ఇరుక్కుని మహిళాకూలి నరకయాతన

Published : Jul 19, 2023, 01:03 PM IST
వరి మడిలో వింత ప్రమాదం... బోరుబావిలో ఇరుక్కుని మహిళాకూలి నరకయాతన

సారాంశం

వరి నాటు వేయడానికి వెళ్లిన మహిళా కూలి బోరుబావిలో ఇరుక్కుపోయిన ఘటన  యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.  

భువనగిరి : బోరు బావిలో చిన్నారులు పడిపోయిన అనేక ఘటనలు చూసాం. కానీ ఓ మహిళ చిన్నపాటి బోరుబావిలో ఇరుక్కుని విలవిల్లాడిపోతూ దాదాపు నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించింది. వ్యవసాయ పనులకోసం పొలానికి వెళ్లి పూడ్చకుండా వదిలేసిన బోరుబావిలో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయింది. అయితే స్థానికులు, పోలీసులు ఎంతో కష్టపడి ఎలాగోలా మహిళను బోరుబావిలోంచి బయటకుతీసి ప్రాణాలు కాపాడారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వరినాట్లు జోరందుకోగా వెంకట్ రెడ్డి కూడా ఇందుకోసం పొలాన్ని సిద్దం చేసుకున్నాడు. అయితే గతంలో సాగునీటి కోసం బోరు వేయగా నీరు పడలేదు. దీంతో ఆ బోరుబావిని పూడ్చకుండా అలాగే వదిలేసాడు. ఆ భూమిలోనే రైతు వెంకట్ రెడ్డి వరి వేయడానికి మడులు రెడీ చేసుకున్నాడు. 

వెంకట్ రెడ్డి పొలంలో వరినాట్లు వేయడానికి మరికొందరు మహిళా కూలీలతో కలిసి పద్మ వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ మడిలో వరినాటు వేస్తుండగా ప్రమాదవశాత్తు పద్మ బోరుబావి ఇరుక్కుపోయింది. అమాంతం బోరుబావిలో పడి నడుము వరకు అందులో కూరుకుపోయింది. తోటి కూలీలు, గ్రామస్తులు ఎంత ప్రయత్నించినా పద్మను బోరుబావిలోంచి బయటకు తీయలేకపోయారు. దీంతో వారు పోలీసులు సహాయాన్ని కోరారు. 

Read More  మంత్రి ఎర్రబెల్లి క్యాంప్ ఆఫీస్ లో కుప్పకూలిన భారీ చెట్టు... తప్పిన పెను ప్రమాదం

గ్రామస్తుల సమాచారంతో వెంకట్ రెడ్డి పొలానికి వెళ్ళిన పద్మ పరిస్థితిని గమనించారు. వెంటనే జేసిబిని తెప్పించి బోరుబావికి సమాంతరంగా తవ్వించి కేసింగ్ ను ధ్వంసం చేసారు. ఇలా నాలుగైదు గంటల శ్రమించి ఎలాగోలా మహిళను సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బయటకు తీసిన వెంటనే పద్మను భువనగిరి జిల్లా హాస్పిటల్ కు తరలించారు. ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. 

బోరుబావిని పూడ్చకుండా అలాగే వదిలేసిన రైతు వెంకట్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. బోరువేసిన తర్వాత నీరు పడకుంటే అలాగే వదిలేస్తే ఇలాంటి ప్రమాదాలే జరగవచ్చు... కాబట్టి రైతులు వెంటనే అలాంటి బోరుబావులను పూడ్చాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!